CM KCR Medchal Tour: నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వారు ఎప్పటికీ ఉంటారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి వారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలోని అంతాయిపల్లి వద్ద 30 ఎకరాల్లో 50 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.
మనం జాగ్రత్తగా ఉంటే మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోగలమని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అందరూ ఐక్యంగా ఉండి రాష్ట్ర ప్రగతికి దోహదపడాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపేలా చైతన్యంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఏమాత్రం మోసపోయినా గోస పడతామని ప్రజలను సీఎం హెచ్చరించారు. మేడ్చల్‌లో కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రజలకు పరిపాలన ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరుగుతాయని వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు.
మనం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటే విద్యుత్, సంక్షేమం వచ్చేదా? దేశంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చలు జరగాలి. చైతన్యవంతమైన సమాజం ఉంటే ముందుకు పురోగమిస్తాం. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే మళ్లీ ఏకం కావడం కష్టం. అభివృద్ధి చెందిన దేశాల బాటలో కుల, మత రహితంగా ముందుకు సాగాలి. నీచ రాజకీయల కోసం ఎంతకైనా తెగించే ఎప్పటికీ ఉంటారు. అందుచేత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోగలం.- కేసీఆర్, సీఎం