దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ (Congress) నాంది పలికిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. దళిత బంధును హుజురాబాద్‌కు మాత్రమే కాకుండా 119 నియోజకవర్గాల్లో గిరిజనులకు కూడా అమలు చేయాలని సీఎల్పీ నేత డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ (Cm Kcr) దత్తత గ్రామం మూడు చింతలపల్లి (Mudu Chintalapalli)లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న రెండు రోజుల దీక్షలో భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టడంలేదని భట్టి ధ్వజమెత్తారు. నిధులు ఖర్చు కాకపోతే క్వారీఫార్వర్డ్ చేయాల్సి ఉండగా అది కూడా చేయడం లేదని ఆక్షేపించారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ ఏర్పాటు చేశారో అవి ఈ రోజు నెరవేరడంలేదన్నారు. తెలంగాణలో అత్యంత వెనకబడిన వర్గాలను తలెత్తుకునేలా చేయాలని తెలిపారు. ఆత్మగౌరవంతో బతకాలనుకునే ప్రతీ ఒక్కరూ కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలన్నారు. కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలు విజయవంతమయ్యాయని భట్టి పేర్కొన్నారు.
తెలంగాణను సామాజిక తెలంగాణగా నిర్మించుకుని... రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన బలహీన వర్గాల ప్రజలందరికీ ఆర్థికంగా చేయూతనిచ్చి వాళ్లు తలెత్తుకునేలా చేయడమే ఈ దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా ముఖ్య ఉద్దేశం. ఆనాడు కాంగ్రెస్ హాయంలో తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏడున్నర సంవత్సరాలుగా ఈ సీఎం పక్కదారి పట్టిస్తున్నాడు. ఏడున్నర సంవత్సరాల తర్వాత దళితబంధును తీసుకొచ్చి వీరికి న్యాయం చేస్తా అని మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిని శాసనసభలో, బయట ప్రశ్నిస్తూనే వచ్చాం. సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి, నీరుగారుస్తున్నారని పదేపదే చెప్పాం. ఇవన్నీ చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు నాంది పలికాం.