మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్లో మంత్రి మల్లారెడ్డి ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ మండలంలోని సూరారం గ్రామంలో సర్వే నం 115, 116, 117లో ఉన్న తన భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేయడంతో పాటు ఫోర్జరీ పత్రాలు సృష్టించారని బాధితురాలు శ్యామలాదేవి ఆరోపించారు. భూమి అమ్మాల్సిందిగా తనను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ హెచ్చార్సీని ఆశ్రయించారు.
తన తల్లి బతికుండగా మంత్రి మల్లారెడ్డికి అరెకరం భూమి అమ్మడంతో... దానిని అదునుగా చేసుకొని ఫోర్జరీ సంతకాలతో మిగతా ఒకటిన్నర ఎకరా భూమిని కబ్జా చేశారని ఆమె ఆరోపించారు. వారే కోర్టులో కేసు వేసి తనను కోర్టుకు లాగారని వాపోయారు. 2015లో తన తల్లి చనిపోవడంతో కోర్టులో దావా వేసిన మస్తాన్... తనకు నోటీసు పంపారని శ్యామలదేవి తెలిపారు. తప్పుడు పత్రాలతో తన భూమి తనది కాదని బెదిరిస్తున్నారని ఆమె హెచ్చార్సీని ఆశ్రయించారు. మల్లారెడ్డి తన అనుచరులను ఇంటికి పంపించి భూమిని అమ్మాల్సిందిగా... ఎంతో కొంత డబ్బు ఇస్తామని బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపించారు.