BJP Pracharak Training Classes In Shamirpet: తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో 90 స్థానాలు గెలవడమే లక్ష్యంగా మరింత గట్టిగా పనిచేయాలని బీజేపీ అగ్రనాయకులు.. తెలంగాణ నాయకత్వానికి ఉద్బోధించారు. ఈ మేరకు శామీర్‌పేటలో జరిగిన బీజేపీ ప్రచారక్ శిక్షణ తరగతులకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్.. ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మిషన్ 90 పేరుతో ప్రత్యేకంగా జరిగిన ఈ సమావేశంలో నేతలకు.. బీఎల్ సంతోష్ దిశానిర్దేశం చేశారు.
ఒక్కో నియోజకవర్గంలో.. ప్రభారి, కన్వీనర్, పాలక్, విస్తారక్ అని నియమించగా.. అందరూ సమన్వయంతో పనిచేయాలని బీఎల్ సంతోష్ సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు ఎర కేసుపై స్పందించిన బీఎల్ సంతోష్.. తనపై ఆరోపణలు చేసిన వారే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ప్రజలకు తానెవరో తెలియకపోయినా.. ప్రతి ఇంటికి తన పేరు తీసుకెళ్లారని సంతోష్ చెప్పినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సమావేశం తర్వాత ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్ అన్నారు.
"తెలంగాణ ప్రజలు అహంకారి, కుటుంబ రాజకీయవాది, అవినీతిమయమైన కేసీఆర్ సర్కార్‌ను తప్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు నవంబరులో వచ్చినా, డిసెంబరులో వచ్చినా, 2024 లోక్‌సభ ఎన్నికలు వచ్చినా తెలంగాణలో టీఆర్ఎస్/బీఆర్‌ఎస్ పోయి బీజేపీ వస్తుంది." - తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహాల అమలు: తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి.. 90 స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విశ్వాసం వ్యక్తంచేశారు. తమ పార్టీకి అభ్యర్థులేరని.. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్న బీజేపీ.. ఆ దిశలో మరో అడుగు వేసింది. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలకు పాలక్‌లను ప్రకటించింది.