తెలంగాణ

telangana

ETV Bharat / state

Murder Attempt: వివాహేతర సంబంధం.. మందలించేందుకు వెళితే..! - vinay kumar case in jeedimetla

Murder Attempt in Jeedimetla: భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య తమ కుటుంబసభ్యులతో కలిసి మందలించింది. ఈ గొడవలో భార్య తరఫు బంధువుపై భర్త దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Husband and wife quarrel in Jeedimetla
Husband and wife quarrel in Jeedimetla

By

Published : Apr 30, 2023, 12:56 PM IST

Murder Attempt in Jeedimetla: ప్రస్తుత రోజుల్లో వివాహేతర సంబంధం వల్ల భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న ఓ ఇల్లాలు ఆ పని మానుకోమని చెప్పింది. అయినా భర్తలో ఎటువంటి మార్పు రాకపోవడంతో తన కుటుంబసభ్యులతో భర్తను మందలించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆ భర్త తన భార్యను కొట్టాడు. ఈ గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన భార్య తరఫు బంధువుపై అతడు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ బంధువుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా పోలీసులకు విషయం తెలియడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వల్లభ్​భాయి పటేల్ నగర్‌లో భార్యాభర్తలు నవత్ వినయ్ కుమార్, స్వప్న నివాసం ఉంటున్నారు. 2007లో వీరికి వివాహం అయింది. స్వప్న అంగన్​వాడీ కేంద్రంలో హెల్పర్‌గా, వినయ్ కుమార్ స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 2020 సంవత్సరంలో భర్త వినయ్ షాపూర్​నగర్‌లో నివాసం ఉండే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఆ సంబంధం మానుకోవాలని ఎన్నోసార్లు భర్తకు చెప్పింది.

అయినా ఎంతకూ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో శనివారం రాత్రి ఆమె తల్లిదండ్రులు, చెల్లి, మామ రవిలు షాపూర్​నగర్‌లో మరో మహిళతో సహజీవనం చేస్తున్న వినయ్ కుమార్ ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అక్కడ వేరే మహిళతో ఉన్న వినయ్ కుమార్‌ను స్వప్న కుటుంబీకులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుని మందలించారు. దీంతో కోపోద్రిక్తుడైన నిందితుడు.. భార్యను తీవ్రంగా కొట్టాడు. భార్యాభర్తల గొడవను ఆపేందుకు స్వప్న బంధువు రవి ప్రయత్నించాడు. ఈ క్రమంలో వినయ్​ కుమార్ చాకుతో రవిపై దాడి చేశాడు.

రవి మెడ, ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం షాపూర్​నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని‌ దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details