తెలంగాణ

telangana

ETV Bharat / state

విధి నిర్వహణలో ఏఎస్​ఐ మృతి... అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు - asi mahipal reddy Funeral news

ఓ వ్యక్తి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. ఏం చేస్తారులే అన్న లెక్కలేనితనం... బాధ్యతయుతమైన పోలీసును పొట్టనబెట్టుకుంది. ఈనెల 27న విధి నిర్వహణలో భాగంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పాల్గొన్న ఏఎస్‌ఐను క్యాబ్‌ డ్రైవర్‌ ఢీకొట్టగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జీవన్మృతుడయ్యాడు. విధి నిర్వాహణలో ప్రాణాలొదిలిన అధికారికి నివాళులర్పించిన పోలీసులు... అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

asi killed
ఏఎస్​ఐ మృతి

By

Published : Mar 31, 2021, 9:12 PM IST

విధి నిర్వహాణలో ఏఎస్​ఐ మృతి...

మద్యం మత్తులో ఓ వ్యక్తి అతివేగంగా కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్​ఐ... మూడ్రోజుల పాటు మృత్యువుతో పోరాడి, తుదిశ్వాస విడిచారు. రాజేంద్రనగర్‌ కిస్మత్‌పూర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి కేపీహెచ్​బీలో ఏఎస్​ఐగా విధులు నిర్వహిస్తున్నారు.

మద్యం మత్తులో ఢీకొట్టి...

గత శనివారం రాత్రి 11 గంటల సమయంలో నిజాంపేట రోడ్డులోని కొలను రాఘవరెడ్డి గార్డెన్‌ వద్ద పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తుండగా... ఓ వ్యక్తి కారుతో హోంగార్డును ఢీకొట్టాడు. సమాచారమందుకున్న ఏఎస్​ఐ మహిపాల్‌ రెడ్డి... ఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా మద్యం సేవించి కారులో వచ్చిన అస్లాం అనే వ్యక్తి ఏఎస్​ఐని ఢీకొట్టాడు. వెంటనే తీవ్రగాయాల పాలైన పోలీసు అధికారిని కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయన.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు.

అవయవదానం...

జీవన్మృుతుడైన మహిపాల్‌ రెడ్డి కిడ్ని, లివర్‌ను కుటుంబ సభ్యులు అధికారుల సమక్షంలో జీవన్​దాన్‌ స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు. అనంతరం కిస్మత్​పూర్‌లోని ఆయన స్వగృహానికి పార్థీవ దేహాన్ని తరలించారు. అంత్యక్రియలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు పోలీసు అధికారులు హాజరై... నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాడసానుభూతి తెలిపిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌... అంతిమయాత్రలో మహిపాల్‌రెడ్డి పాడే మోశారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.

పోలీసుల సీరియస్...

మద్యం తాగిన డ్రైవర్‌ నిర్లక్ష్యం ఒక అధికారి ప్రాణం తీసిన ఘటనను పోలీసు అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిపాల్‌రెడ్డి స్ఫూర్తితో... డ్రంక్‌ అండ్‌ డ్రైవ్​పై మరింత కఠినంగా వ్యవహారిస్తామని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. తనిఖీ సమయంలో సిబ్బంది భద్రతకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఏఎస్​ఐ మహిపాల్​రెడ్డి జ్ఞాపకార్థంగా సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

ఇదీ చూడండి:పోలీసుల ప్రాణాల మీదికి తెస్తున్న డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details