హైదరాబాద్ శివారు దేవరయాంజల్‌లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ భూములపై విచారణ ఆరోరోజూ కొనసాగింది. మాజీమంత్రి ఈటల గోదాములపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టారు. ఆయన భార్య జమున పేరిట ఉన్న గోదాముల రికార్డులను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎంత విస్తీర్ణంలో నిర్మించారు? పురపాలికకు ఎంత ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు? ఎవరికి అద్దెకు ఇచ్చారు.. తదితర వివరాలు సేకరించారు.
ఈటల గోదాములపై ఏసీబీ, విజిలెన్స్ విచారణ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజల్‌లోని ఆలయ భూములపై విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఆయన భార్య జమున పేరిట ఉన్న గోదాముల వివరాలను సేకరించిన అధికారులు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. గోదాములు నిర్మించిన ప్రదేశం, ఖాళీ ప్రాంతాల్లో డిజిటల్ సర్వేతోపాటు గూగుల్ మ్యాపుల ఆధారంగా 8 మంది తహసీల్దార్ల బృందం సర్వే చేపట్టింది.
సర్వే నం.57లో 6.23 ఎకరాలు ఈటల జమున పేరిట ఉంది. అందులో 1.30 లక్షల చదరపు అడుగుల్లో గోదాములు ఉన్నట్లు గుర్తించారు. సర్వే నం.729లో 36,500, సర్వే నం.735/ఎ 30 వేల చదరపు అడుగుల్లో ప్రైవేటు మద్యం గోదాములు ఉన్నట్లు గుర్తించారు. వాటి రికార్డులూ స్వాధీనం చేసుకున్నారు. ఐఏఎస్ అధికారుల కమిటీ శుక్రవారం సర్వేలో పాల్గొనలేదు. 8 మంది తహసీల్దార్ల నేతృత్వంలోని బృందాలు క్షేత్రస్థాయిలో సర్వే కొనసాగించాయి. గోదాములు నిర్మించిన ప్రదేశం, ఖాళీ ప్రాంతాల్లో డిజిటల్ సర్వేతోపాటు గూగుల్ మ్యాపుల ఆధారంగా పరిశీలించారు. రెండు, మూడు రోజుల్లో నివేదికను సిద్ధం చేయాలని కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:ఇంటింటా కొవిడ్ ఫీవర్ సర్వే: హరీశ్ రావు