పార్టీలో సంస్థాగతంగా మార్పులు, ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాజస్థాన్ ఉదయ్‌పూర్ వేదికగా నిర్వహించిన చింతన్‌శిబిర్ తరహాలో రాష్ట్రంలోనూ మేధోమథన సదస్సు జరగనుంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇవాళ, రేపు రెండు రోజుల పాటు హైదరాబాద్ శివారు కీసరలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌పైనే ఇందులో ప్రధాన చర్చ జరగనుంది.
పార్టీలో 50 శాతం పదవులను 50 ఏళ్లలోపు వారికే కేటాయించాలని, అందులోనూ సామాజిక న్యాయం పాటించాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఒక్క కుటుంబానికి ఒకే టికెట్ అంశాన్ని సైతం ప్రతిపాదించారు. వీటన్నింటిపైనా పీసీసీ మేధోమథనంలో చర్చిస్తారు. ఇవే కాకుండా వ్యవసాయం, సంస్థాగతంగా పార్టీ బలోపేతం, యువత, ఆర్థికం, సామాజిక న్యాయం, రాజకీయం వంటి 6 అంశాలపై సమగ్రంగా చర్చించేలా పీసీసీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు సీనియర్లను కన్వీనర్లుగా నియమించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలనే లక్ష్యంతో ఈ మేధోమథన సదస్సును నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క తెలిపారు.
అధిష్ఠానానికి నివేదిక..: ఈ చింతన్ శిబిర్‌లో దాదాపు 160 మంది నాయకులు పాల్గొననున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతారని చింతన్ శిబిర్ కమిటీ కన్వీనర్ మహేశ్వర రెడ్డి తెలిపారు. రెండు రోజుల్లో నిర్దేశిత అంశాలపై పూర్తిస్థాయిలో చర్చించి అధిష్ఠానానికి నివేదికను పంపించనున్నట్లు వివరించారు.