రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. మందు బాబులతో వ్యాపారం మూడు సీసాలు.. ఆరు పెగ్గులు అన్నట్లుగా ఉంది. మత్తు కోసం ఆరాటపడే క్రమంలో కరోనా మహమ్మారి గురించి పట్టించుకోవడం లేదు. దుకాణాల ముందు మాస్కు లేకుంటే మద్యం లేదు అన్న బోర్డులు నామమాత్రంగా పెట్టారు. కానీ అమలు విషయం గాలికొదిలేశారు. కరోనా వేళ ఉమ్మడి మెదక్ జిల్లాలోని మద్యం దుకాణాలు దాదాపు అన్నీ ఇలాగే వ్యవహరిస్తున్నాయి.
నిబంధనలు గాల్లో...
చాలా చోట్ల మాస్కు లేకుండానే కొనుగోళ్లు చేస్తున్నారు. దుకాణాదారులు సైతం ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. ఇక కౌంటర్ల ముందు భౌతిక దూరం ప్రసక్తే లేదు. లాక్ డౌన్ తర్వాత మద్యం దుకాణాలు తెరిచినప్పుడు ప్రారంభంలో భౌతిక దూరం పాటించేలా గుర్తులు వేశారు. క్రమంగా ఆ గుర్తులు పోయాయి.. కనీసం దూరం పాటించాలన్న ఆలోచనా పోయింది.