తెలంగాణ

telangana

ETV Bharat / state

నర్సాపూర్​ అడవులు: ఎన్నో అందాలు.. మరెన్నో ప్రత్యేకతలు - నర్సాపూర్​ అటవీ ప్రాంతం ప్రత్యేకతలు

ఆరో విడత హరితహారం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నర్సాపూర్ అడవులను ఎంపిక చేశారు. ఇక్కడ మొక్క నాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ అడవులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నర్సాపూర్ అడవి అందాలు, ప్రత్యేకతలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం...

Narsapur Forest
నర్సాపూర్​ అడవులు: ఎన్నో అందాలు.. మరెన్నో ప్రత్యేకతలు

By

Published : Jun 25, 2020, 6:33 AM IST

Updated : Jun 25, 2020, 7:00 AM IST

నర్సాపూర్​ అడవులు: ఎన్నో అందాలు.. మరెన్నో ప్రత్యేకతలు

హైదరాబాద్​కు అత్యంత సమీపంలో ఉన్న నర్సాపూర్ అడవికి అనే ప్రత్యేకతలున్నాయి. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల మధ్య విస్తరించిన ఈ అడవి ఉమ్మడి మెదక్ జిల్లాకు మణిహారం. దక్షిణ తెలంగాణలో హైదరాబాద్​కు సమీపంలో ఉన్న దట్టమైన అడవి కూడా ఇదే కావడం విశేషం. అరుదైన వృక్షాలు.. గుట్టలు.. వాగులు.. సెలయేర్లతో ప్రకృతి రమణీయతకు మారుపేరుగా ఉంటుంది. ఈ అడవి అందాలను ఒక్కమాటలో వర్ణించాలంటే.. పురి విప్పిన మయూరంలా ఉంటాయి.

వివిధ పక్షులు, జంతువులకు నిలయం

గుమ్మడిదల, తూప్రాన్, మెదక్ సెక్షన్ల మధ్య ఉన్న నర్సాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ 1752 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. చెన్నంగి, గుప్పెర, తాని, తెల్ల మద్ది, తెల్ల బిట్ల, టేకు, బిల్లగొడిశె, మోదుగ, విప్ప, సీతాఫలం వంటి చెట్లతో ఏపుగా దట్టంగా కనిపించే ఈ అడవి మనసును ఉల్లాస పరుస్తుంది. వివిధ రకాలైన జంతువులకు, పక్షులకు నిలయంగా మారింది. జింకలు, కొండ గెర్రెలు, తోడేళ్లు, కోతులు, కుందేళ్లు, నెమళ్లకు నెలవాలం.

ఎటు చూసిన పచ్చదనం, కాలుష్య రహిత వాతావరణంతో ఈ ప్రాంతం కనిపిస్తుంది. ఈ అడవులు పర్యాటకంగానూ ప్రసిద్ధికెక్కాయి. జిల్లాలోని ఏడుపాయల దేవస్థానం, మెదక్‌ చర్చి తదితర ప్రాచీన చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వీటికి సందర్శించే వారు ఈ అడవి గుండానే ప్రయాణించాలి. ఇక్కడ పలు సినిమా, సీరియళ్ల షూటింగ్‌లు చేశారు. అనేక మంది ప్రముఖులు.. ఈ అడవులకు సమీపంలో విడిది కేంద్రాలు, వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేసుకున్నారు.

యువత ఆసక్తి

ఈ అటవీ ప్రాంతంలో చాకరిమెట్ల ఆంజనేయస్వామి దేవాలయం, ముత్యాలమ్మ, మేడలమ్మ, పలుగు పోచమ్మ, తునికి నల్లపోచమ్మ వంటి ప్రసిద్ధ ఆలయాలున్నాయి. ఇక్కడికి హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అటవీ ప్రాంతాన్ని వనభోజన కేంద్రాలుగాను చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు, యువత ఈ అడవుల్లోకి ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు.

ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు నర్సాపూర్ అడవులపై పూర్తి అవగాహన ఉండటం వల్ల.. అభివృద్ధి కోసం రూ. 20 కోట్ల కేటాయించారు. ఈ నిధులతో అడవీ పునరుజ్జీవనంతో పాటు.. పర్యాటకంగా అభివృద్ధి చేశారు. 562 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు. దీని చుట్టూ 15 కి.మీ. పొడవు కంచె నిర్మించారు. వాగులపై రెండు చెక్ డ్యాంలు, 10 ఊట చెరువులను నిర్మాణం చేశారు. ఎత్తైన గుట్ట మీద 60 అడుగుల వాచ్ టవర్ నిర్మించారు. ఔషద ఖని పేరుతో ప్రత్యేకంగా హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేశారు.

ఇన్ని ప్రత్యేకతలున్న ఈ అడవిలోని అర్బన్​ పార్కును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. జరుగుతున్న పునరుజ్జీవన పనులను పరిశీలించనున్నారు.

ఇవీచూడండి:కేసీఆర్​ పర్యటన: అడవిని జల్లెడ పట్టిన బలగాలు

Last Updated : Jun 25, 2020, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details