అదనపు కలెక్టర్ నగేష్ ఇంట్లో బాధితుడి సంతకంతో చెక్కులు కోటి 12 లక్షలు లంచం కేసులో అరెస్టు అయిన... మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌తో పాటు.. ఆర్డీవో అరుణా రెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం, నగేష్ బినామీగా వ్యవహరించిన జీవన్ గౌడ్.. అవినీతి నిరోధక శాఖ అధికారులు లోతైన విచారణ చేపట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో... ఐదుగురు నిందితులను 6 గంటల పాటు ప్రశ్నించారు.
అనిశాకు సహకరించలేదు..
అనిశా బృందం దాడి చేసిన సమయంలో అదనపు కలెక్టర్ నగేష్.. ఉన్నతాధికారిననే దర్పం ప్రదర్శించినట్లు సమాచారం. చాలా సేపు అనిశా బృందానికి సహకరించలేదు. అధికారుల నుంచి ప్రశ్నల వర్షం కురవడం.. ఆధారాలు బయటపెట్టడం వల్ల ఇక మిన్నకుండిపోయాడు. గురువారం విచారణలో మాత్రం... లంచపు సొమ్ము కింద బాధితుడి నుంచి తీసుకున్న చెక్కుల గురించి మాత్రం.. ఎంత ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. దీంతో విచారణ బృందం తమదైన శైలిలో నిలదీయటంతో.. సమాచారం బయటపడింది. ఆ చెక్కులను బీరువాలోని చీరలో దాచి ఉంచినట్లు తేలడం వల్ల వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇతర ఉన్నతాధికారుల పాత్ర..?
బాధితుడి సంతకంతో ఉన్న చెక్కులు అదనపు కలెక్టర్ ఇంట్లో లభించడం.. కేసులో కీలక సాక్ష్యం కానుంది. 112 ఎకరాలకు సంబంధించి నిరభ్యంతర పత్రం జారీకి.. తయారు చేసిన నోట్ ఫైల్‌పై అప్పటి కలెక్టర్ ధర్మారెడ్డి పదవీ విరమణ పొందే రోజే వేగంగా దస్త్రాలు సిద్ధం చేయాలని ఆర్డీవో అరుణ రెడ్డిపై నగేష్ ఒత్తిడి తెచ్చినట్లు తేలింది. ఓ వైపు గత జులై 31 న పదవీ విరమణ కార్యక్రమానికి వెళ్లేందుకు.. ఆర్డీవో సిద్ధమవుతుండగానే దస్త్రాలను కూడా వెంట తీసుకురావాలని ఆదేశించినట్లు నిర్ధరణకు వచ్చారు. నగేశ్ ఏ మాత్రం జంకకుండా బాధితుడితో నేరుగా ఫోన్‌లో బేరసారాలు సాగించడం.. విచారణ బృందాన్ని విస్తుపోయేలా చేసింది. లంచం డబ్బు కోసం నగేష్ విడతల వారీగా బాధితుడితో మాట్లాడిన సంభాషణల ఆడియో క్లిప్పింగ్‌లు.. అనిశా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే ఈ వ్యవహారంలో ఇతర ఉన్నతాధికారుల పాత్ర ఏమైనా ఉందా అని.... నగేష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు నిలదీశారు.
చంచల్‌గూడ జైలుకు తరలింపు..
అవినీతి నిరోధకశాఖ విచారణకు ముందు.. ఐదుగురు నిందితులను అనిశా అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఉస్మానియా ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో అరుణ రెడ్డి తో పాటు.. మిగతా ముగ్గురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. విచారణ అనంతరం ఐదుగురు నిందితులను... అనిశా అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇదీ చదవండి:నర్సాపూర్ కేసులో నిందితులకు ఈనెల 24 వరకు రిమాండ్