తెలంగాణ

telangana

ETV Bharat / state

Haritha Haram: వెల్దుర్తి త్రీ ఇడియట్స్... అసలైన హరితమిత్రులు - Veldurthy children inspiration

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. తర్వాత వాటిని వదిలేశారు. వర్షాలు లేక మొక్కలు ఎండిపోతున్నాయి. సంరక్షణ కొరవడింది. వాటిని పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఎండిపోతున్న మొక్కల్ని చూసి పసి హృదయాలు కదిలాయి. ఎవరొచ్చినా రాకపోయినా వాటిని కాపాడుకోవాలనే ఆలోచన వారిలో మొదలైంది. తమ చిట్టి చేతులకు పని చెప్పారు. సరదాగా తొక్కే సైకిలే వారి సాధనమైంది. ఎండిపోతున్న మొక్కలకు నీరు పోయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా బయల్దేరారు. వినూత్నమైన ఆలోచనకు కార్యరూపం ఇచ్చి శభాష్ అనుపించుకుంటున్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి చిన్నారులు.

Veldurthy
ఇడియట్స్

By

Published : Aug 6, 2021, 9:07 PM IST

వెల్దుర్తి త్రీ ఇడియట్స్... అసలైన హరితమిత్రులు

ముగ్గురు చిన్నారులు సాత్విక్, మధు కుమార్, శ్రీకాంత్... వీరి స్వస్థలం మెదక్ జిల్లా వెల్దుర్తి. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్న సామెతకు ఈ చిన్నారులు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం (Haritha haram) కార్యక్రమంలో పెద్దమనుషులు మొక్కలు నాటారు. కానీ వాటి సంరక్షణ మరిచారు. ఎండిపోతున్న మొక్కలను చూసిన పసి హృదయాలు చలించిపోయాయి. ఎలాగైనా మొక్కలను కాపాడుకోవాలనే ఆలోచన వారిలో మొదలైంది. వెంటనే ఆ చిన్నారులకు ఓ ఆలోచన వచ్చింది.

ఆచరణలోకి ఆలోచన...

హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా వెల్దుర్తిలో రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటారు. కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఈ మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కలను కాపాడుకునేందుకు చిన్నారులు వినూత్నంగా ప్రయత్నం మొదలు పెట్టారు. ఈ చిన్నారులు ఓ ఇనుప డబ్బాకు పైపు బిగించి... దానిని తమ వద్ద ఉన్న సైకిల్​కు అమర్చారు. కాలువలు, చేతిపంపు వద్ద డబ్బాలో నీటిని నింపుకుని పైపు సాయంతో మొక్కలకు నీరు పోస్తున్నారు.

శభాష్..

ఈ చిన్నారులు చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆకర్షిస్తోంది. మొక్కలను కాపాడుకోవడానికి వీరు పడుతున్న తాపత్రయానికి సర్వత్ర ప్రశంసలు అందుతున్నాయి. ఈ పిల్లలు మొక్కలకు నీళ్లు పోసే దృశ్యాలను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్​ ట్విట్టర్​లో షేర్ చేసి వీరిని అభినందించారు. ప్రస్తుత తరానికి ఈ చిన్నారుల స్ఫూర్తి అవసరమని ఆయన పేర్కోన్నారు. గ్రామ పెద్దలు ఈ ముగ్గురు చిన్నారులను సత్కరించి... ప్రోత్సహించారు.

చిన్నారులకు సత్కారం

ఎండిపోతున్న మొక్కల్ని చూసి ఎలాగైనా బతికించాలనుకున్నాం. అందుకే ఓ పాత డబ్బా తీసుకుని దానికి పైపు బిగించాం. సైకిల్​కు డబ్బా కట్టి అందులో నీళ్లు నింపుకుని ఎండిపోతున్న మొక్కలను నీళ్లు పట్టినం.

-- చిన్నారులు

వృక్షో రక్షితి రక్షితః అన్న నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని వాటి సంరక్షణకు పాటు పడుతున్న ఈ చిన్నారులు అందరికీ ఆదర్శమే.

ఇదీ చూడండి: Mp Santhosh Kumar: 'ఆకుపచ్చని తెలంగాణే మన లక్ష్యం కావాలి'

ABOUT THE AUTHOR

...view details