మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని 11 గ్రామాలకు విద్యుత్తు సరఫరా మెరుగు పరచేందుకు మంజూరు చేసిన రెండు విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మూడేళ్ల క్రితం రూ.3 కోట్లు మంజూరు చేసి మండలంలోని ఉప్పులింగాపూర్, అందుగులపల్లి గ్రామాల్లో నిర్మాణం చేపట్టిన రెండు ఉపకేంద్రాల్లో ఒకటి నిర్మాణం పూర్తయి ఏడాదిగా నిరుపయోగంగా ఉండగా, మరొకటి అసంపూర్తిగా దర్శనం ఇస్తోంది.
మండలంలో ఇప్పటికే వెల్దుర్తి, మంగళపర్తి, దామరంచ, రామాయపల్లి, నాగ్‌సాన్‌పల్లి, మాసాయిపేట గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలు ఉన్నాయి. వెల్దుర్తి, మాసాయిపేటలో 132/33 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్లు ఉన్నాయి. అయితే మండలంలో సాగు విస్తీర్ణం పెరగడం, వ్యవసాయ విద్యుత్తు సరఫరా కనెక్షన్లు ఎక్కువ కావడంతోపాటు త్వరలో కాళేశ్వరం నీళ్లు హల్దీవాగులోకి విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం వల్ల విద్యుత్తు అవసరాలు మరింతగా పెరుగుతాయని భావించిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి 2018లో రెండు 33/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించారు.
2018 జూన్‌లో అప్పటి శాసనసభ ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక విద్యుత్తు సమస్యలు తీరుతాయని భావించిన రెండు గ్రామాల ప్రజల ఆశలు నెరవేరలేదు.
ఏడాదిగా నిరుపయోగంగా..
ఉప్పులింగాపూర్, ఉప్పులింగాపూర్ తండా, ఎదులపల్లి, ఎదులపల్లి తండా, బండపోసానిపల్లి, చిన్నశంకరంపేట మండల పరిధిలోని కొన్ని తండాలకు విద్యుత్తు సరఫరా మెరుగు పర్చాలని ఉప్పులింగాపూర్‌లో విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేశారు. గుత్తేదారు నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగగా ఏడాది క్రితం పూర్తయ్యాయి. రామాయపల్లి, వెల్దుర్తి ఉపకేంద్రాల నుంచి విద్యుత్తు సరఫరాను తొలగించి ఉప్పులింగాపూర్ ఉపకేంద్రం నుంచి సరఫరా చేయాల్సి ఉండగా ఏడాదిగా ఎవరూ పట్టించుకోవడం లేదు.