గులాబీ కోట, ఉద్యమాల ఖిల్లాగా ఉమ్మడి మెదక్ జిల్లా చరిత్రకెక్కింది. ఎన్నికలు ఏవైనా ఫలితాలు తెరాసకు అనుకూలంగా ఉంటాయి. అందరూ ఊహించినట్లుగానే మెదక్ పార్లమెంటరీ స్థానంలో తెరాస నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌పై 3లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో జయభేరీ మోగించారు. ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించటం వల్ల గులాబీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు.
అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు తెరాస..
సుధీర్ఘకాలంపాటు హస్తం పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్ స్థానాన్ని 1999లో హస్తం పార్టీ చేజార్చుకుంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా తొమ్మిదిసార్లు కాంగ్రెస్ గెలిచింది. 2004 నుంచి తెరాసకు కంచుకోటగా మారింది.
సంక్షేమమే అస్త్రం..
తెరాస అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, దశాబ్దాలుగా ఎన్నికల హామీలుగా మిగిలిపోయిన అక్కన్నపేట-మెదక్, మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వేలైను సాధించడం వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభాకర్ బరిలో నిలిచి గెలుపొందారు. హరీశ్‌రావు కూడా ప్రభాకర్ తరఫున ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మాజీ మంత్రి హరీశ్‌రావు మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో సమన్వయ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుని పార్టీ గెలుపు కోసం కృషి చేశారు.