చెరువులోకి చేపలవేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు - మెదక్ జిల్లా ఇబ్రహీంపూర్ తాజా వార్తలు
09:15 August 19
చెరువులోకి చేపలవేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు
మెదక్ జిల్లాలో చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి పెద్ద చెరువులోకి చేపలవేటకు వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు అదే గ్రామానికి చెందిన గుండెబోయిన ముత్యాలు, అతని బావ వినయ్‌గా గుర్తించారు.
బుధవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లి ఎంతకీ ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు రాత్రి, ఈరోజు ఉదయం గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలు వెలికితీయించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరు యువకులు ఒకేసారి మరణించడం వల్ల ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. దుబ్బాక నియోజకవర్గం రెబల్టీం నాయకుడు రంగయ్య మృతుల కుటుంబాలను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు.
ఇదీ చూడండి :తెలంగాణలో కొత్తగా 1,763 కరోనా కేసులు, 8 మరణాలు