తెలంగాణ

telangana

ETV Bharat / state

పురపాలికల్లో కరోనా వ్యాప్తి.. శ్రద్ధపెడితేనే తగ్గుతుందిక! - medak district news

కరోనా వైరస్‌ ప్రతి చోటా వేగంగా వ్యాపిస్తోంది. పల్లెలతో పోలిస్తే పురపాలికల్లో జన సాంద్రత అధికంగా ఉంటుంది. వ్యాప్తి పెరగడానికి దోహదం చేసే ఎన్నో కారణాలు ఉన్నాయి. మరోవైపు చాలా చోట్ల రోజుకొకరు మృత్యువాత పడుతుండటం గమనార్హం. పాజిటివ్‌గా నిర్ధారణ అయి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోతున్నారు. మరోవైపు ఇళ్లలో ఉంటూ వివిధ రకాల ఇబ్బందులతో ఊపిరొదులుతున్నారు. వీరిలో సుమారు 40 శాతం వరకు 40- 45 ఏళ్ల లోపు వారే అధికంగా ఉంటుండటం కలవరపరుస్తోంది.

corona spreading, corona spreading in municipalities
కరోనా వ్యాప్తి, పురపాలికల్లో కరోనా వ్యాప్తి

By

Published : May 14, 2021, 7:34 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. పల్లెల్లో కంటే పురపాలికల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతాల్లోనే వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశాలున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని కొన్ని పురపాలికల్లో పరిస్థితితో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యుల సూచనలపై కథనం.

  • నర్సాపూర్‌ పురపాలికలో ఈ నెల 11న ఒక్కరోజే అయిదుగురు మృతి చెందారు. వీరంతా కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న వారే. వీరిలో నలుగురు 40 ఏళ్ల లోపు వారే. నెల రోజుల వ్యవధిలో మహమ్మారి బారిన పడి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ వ్యాప్తి ఎక్కువ కావడంతో పాటు రోజురోజుకు మరణాలు పెరుగుతుండటంతో జిల్లా పాలనాధికారి హరీశ్‌ గురువారం పురపాలికలో పర్యటించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
  • తూప్రాన్‌లో ఇటీవల క్రమంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నెల ప్రారంభం నుంచి పరిశీలిస్తే రోజుకొకరు చొప్పున మృత్యువాత పడుతున్నారు.
  • సంగారెడ్డి పురపాలికలో గత 20 రోజుల వ్యవధిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్‌ బాధితుల సంఖ్యా ఎక్కువగానే ఉంది. కనీసం పరిశుభ్రత అంశంపై ఇక్కడ యంత్రాంగం దృష్టిసారించడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియ కూడా సరిగా కొనసాగడం లేదు.
  • సదాశివపేట పట్టణంలో రెండో దశలో 26 మంది కొవిడ్‌తో చనిపోయారు.
  • ఐడీఏ బొల్లారం పురపాలికలో అధికారిక లెక్కల ప్రకారమే నెల రోజుల్లో 15 మంది చనిపోయారు. కరోనా లక్షణాలతో మరణించిన వారి సంఖ్య ఇందుకు రెట్టింపు స్థాయిలో ఉంటుందని స్థానిక అధికారులే చెబుతున్నారు.
  • రామాయంపేటలో ఏప్రిల్‌ 1 నుంచి ఇప్పటి వరకు 21 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. హుస్నాబాద్‌ పురపాలిక పరిధిలో గత 13 రోజుల్లో ఏడు మంది మృతిచెందారు.

ఇలా చేస్తే మేలు..

  • పురపాలికల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్న కాలనీల్లో సోడియం హైపోక్లోరైడ్‌ రసాయనాన్ని క్రమం తప్పకుండా పిచికారీ చేయించాలి. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి యంత్రాంగం పనిచేయాలి.
  • వైద్యుల సలహాలు, సూచనలు పొందేందుకు వీలుగా ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలి. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే ఆటోలను ఇందుకోసం వాడుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. కానీ చాలా చోట్ల ఇది అమలు కావడం లేదు. ఇకనైనా ఈ దిశగా ముందుకు సాగాలి.
  • ప్రస్తుతం ఇంటింటి సర్వే నడుస్తోంది. పురపాలికల్లో దీన్ని మొక్కుబడిగా చేపడుతున్నారు. ఇలా కాకుండా బాధ్యతతో చేసి లక్షణాలున్న వారిని గుర్తిస్తే మేలు. పట్టణవాసులూ వారికి సహకరించి వివరాలు అందించాలి.
  • కౌన్సిలర్లు ఈ సమయంలో కాస్త చురుగ్గా ఉంటే ప్రయోజనం ఉంటుంది. తమ పరిధిలోని కాలనీల్లో లక్షణాలున్న వారు చికిత్స తీసుకునేలా వీరు అవగాహన మరింత పెంచితే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్ఛు.

వైద్యుల సూచనలు..

  • పట్టణాల్లో వ్యాప్తి పెరగడానికి జన సాంద్రత ప్రధాన కారణంగా చెప్పాల్సిందే. దుకాణాలు, ఇతరత్రా చోట్లా ఎక్కువ మంది గుమిగూడుతుంటారు. భౌతిక దూరాన్ని విస్మరిస్తారు. బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ రెండు మాస్కులు ధరించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒకరికొకరు కనీసం రెండు మీటర్ల దూరంలో ఉండాలి. ఈ విషయంలో పలువురు వైద్యులు ఇలా సూచనలు చేస్తున్నారు.
  • చాలా మంది కరోనా సోకిన మొదట్లో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. కూల్‌డ్రింక్‌ తాగితే జలుబు అయిందని, గొంతునొప్పి వచ్చిందని సర్ది చెప్పుకొంటున్నారు. ఎండలో తిరగడంతో కొద్దిగా జ్వరం వచ్చిందని కొందరు వైద్యుల సలహాలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. ఇది సరికాదు. తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు, విరేచనాలు, వాంతులు.. ఇలా ఏ లక్షణం కనిపించినా అప్రమత్తం కావాల్సిందే.
  • 45 ఏళ్ల లోపు వారు స్వల్పంగా కనిపించే లక్షణాలను పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గుతున్నా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో పరిస్థితి చేయిదాటి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అందుకే స్వల్ప లక్షణాలు కనిపించగానే జాగ్రత్త పడి ఆక్సీమీటరుతో ఆక్సిజన్‌ స్థాయిలు పరీక్షించుకోవాలి. 94 అంతకంటే తక్కువగా వస్తుంటే వైద్యుల సలహా తీసుకోవడం మేలు.

ఇదీ చదవండిరాష్ట్రానికి తొలి కంటెయినర్‌ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌

ABOUT THE AUTHOR

...view details