సుజాత స్వస్థలం గుంటూరు. ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నారు. అనంతరం ఇండోయూరప్ కల్చరల్ ఎక్సేంజీ పథకంలో భాగంగా బల్గేరియాలో ఇంజనీరింగ్ చదివే అవకాశం వచ్చింది. ఆధునిక భావజాలం ఉన్న తల్లిదండ్రులు సుజాతను ప్రోత్సహించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం వివిధ దేశాల్లో ఉద్యోగావకాశాలు వచ్చినా సుజాత స్వదేశానికే తిరిగి వచ్చారు. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో సరైన అవకాశాలు లేకున్నా నిరాశ చెందకుండా ప్రయత్నించి.. త్రివిధ దళాలకు ఆయుధాలు అందించే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చేరారు.
గ్రేడ్ ఏ స్థాయి అధికారిగా చేరి..
1989లో గ్రూప్ ఏ కేడర్ అధికారిగా సుజాత.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో విధుల్లో చేరారు. నాటి నుంచి నేటి వరకు వివిధ స్థాయిల్లో దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనిట్లలో సేవలందించారు. గ్రేడ్ ఏ స్థాయి అధికారిగా ఉద్యోగం ప్రారంభించిన చోటే ప్రస్తుతం ఏజీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల డిజిటలైజేషన్, ఆటోమేషన్‌లో సుజాత సేవలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఉద్యోగుల పే స్లిప్పుల డిజిటలైజేషన్ నుంచి నేటితరం యాప్‌ల రూపకల్పన వరకు ఆమె కీలక పాత్ర పోషించారు.