ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అందరికీ మాస్కుల అవసరం ఎంతో ఉంది. డిమాండ్ పెరగడంతో మార్కెట్లో మాస్కులు సరిపోయేన్ని దొరకటం లేదు. కంపెనీల్లో తయారై వచ్చేసరికి ఆలస్యమవుతుంది. పైగా ‘లాక్‌డౌన్’ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లోనే ఊరకే కూర్చునే బదులు ఉపయోగపడే సాధారణ మాస్కులు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీవాండ్ల శోభారాణి.
తక్కువ ఖర్చుతో మాస్కులను ఎవరికి వారు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కుట్టు యంత్రంపై దర్జీ పని తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. కాటన్ వస్త్రాన్ని రవిక గుడ్డ సైజులో తీసుకొని ఉపయోగించ వచ్చు.
తయారీ ఇలా..
కాటన్ వస్త్రాన్ని 25 సెంటి మీటర్ల పొడవుతో.. 20 సెంటీ మీటర్ల అడ్డంతో కత్తిరించుకోవాలి. వస్త్రం అంచులు నాలుగు వైపులా సన్నగా మలిచి కుట్టాలి. అడ్డం వైపు ఉన్న రెండు అంచు భాగాలను కుచ్చు వచ్చే విధంగా కుట్టాలి. చెవులకు తగిలించుకునేలా సన్నటి నాడాల కోసం వస్త్రాన్ని కత్తిరించుకోవాలి. రెడీమేడ్ నాడాలను సైతం వాడుకోవచ్చు. నాడాలను అడ్డం వైపు ఉన్న రెండు అంచు భాగాలకు తగిలించి కుట్టాలి. దీంతో మాస్కు వాడకానికి సిద్ధమవుతుంది. మాస్కును ముఖానికి తగినట్టు ఆకృతిలో మలచుకొని కుట్టుకుంటే.. వివిధ రంగుల్లో చేసుకుంటే రోజుకో తరహాలో చక్కగా వినియోగించుకోవచ్చు.
సులభంగా ఉతుక్కోవడానికి సౌకర్యంగా ఇవి ఉంటాయి. ఇంట్లో బోర్ కొట్టకుండా మాస్కుల తయారీ నైపుణ్యాన్ని ప్రదర్శించొచ్చు. మనది మనమే చేసుకున్నామన్న తృప్తి మిగులుతుంది. ప్రస్తుత ‘కరోనా’ గడ్డు పరిస్థితుల్లో ఆరోగ్యకర వాతావరణాన్ని పోషించినట్టు అవుతుంది. మాస్కుల వ్యయమూ తగ్గుతుందని చెబుతున్నారు శోభారాణి.
ఇదీ చూడండి:మూడు కిలోమీటర్లే హద్దు... మరిచారో ఇకపై జప్తు!