Syed Shahezadi visited Qadir Khan family: విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లి కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఖదీర్‌ఖాన్ కుటుంబానికి అండగా ఉంటామని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షాహజాదీ హామీ ఇచ్చారు. మెదక్‌లోని ఖాదీర్ ఖాన్ కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షితో కలిసి ఆమె పరామర్శించారు. ఖదీర్ ఖాన్ మృతి చాలా బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కమిషన్ అండగా ఉంటుందని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.
అసలేం జరిగిందంటే..:మెదక్‌కు చెందిన ఖదీర్‌ఖాన్ అనే వ్యక్తిపై దొంగ అనే అనుమానంతో పోలీసులు తమ అధికారాన్ని ప్రదర్శించారు. పోలీస్ స్టేషన్లో నాలుగు రోజుల పాటు దారుణంగా కొట్టారు. అనంతరం నిందితుడు ఆయన కాదని తెలిసి వదిలేశారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న భర్తను ఆసుపత్రికి తీసుకెెళ్లేందుకు భార్య ప్రయత్నించింది. పోలీసులు వారి చేసిన తప్పును ఎవరికి తెలియకుండా ఉండాలని ఇంట్లోనే ఉంచాలని పోలీసులు ఆమెను బెదిరించారు.
తామే మందులు తెచ్చిస్తాం.. దెబ్బలు తగ్గిపోతాయని చెప్పారు. ఖదీర్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 16న మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి వేడుకున్నారు. ఆయనకు భార్య సిద్దేశ్వరి, ముగ్గురు పిల్లలున్నారు.