తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామినవడం సంతోషంగా ఉంది' - ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతానికి ఎంపీగా ఉండటం.. ఆయనతో కలిసి పనిచేయడం తన అదృష్టమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం వల్ల మండు వేసవిలో చెరువులు అలుగు పారుతున్నాయని.. ఇంత కంటే విజయం మరోటి ఉండదని అన్నారు. మెదక్ ఎంపీగా కొత్త ప్రభాకర్ రెడ్డి రెండోసారి ఎన్నికై నేటికి ఏడాది అయింది. ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలు, సంతృప్తిని ఇచ్చిన అంశాలు, భవిష్యత్తు లక్ష్యాలపై ప్రభాకర్ రెడ్డితో ఈటీవీ భారత్‌ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.

mp kotha prabhakar reddy
mp kotha prabhakar reddy

By

Published : May 23, 2020, 5:22 PM IST

మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డితో ఈటీవీ భారత్‌ ముఖాముఖి.

ఈ ఏడాది కాలంలో మీరు సాధించిన విజయాలు ఏంటి?

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం, దిశానిర్దేశంలో కష్టపడి పని చేశాను. జాతీయ రహదారులుపై రెడ్ స్పాట్ల వద్ద ప్రమాద నివారణ చర్యలు, ప్లై ఓవర్లు ఏర్పాటు చేయడం కోసం కృషి చేశాను. మెదక్ పార్లమెంట్ పరిధిలో 18రైల్వే అండర్ పాసులు ఏర్పాటు చేయించాను. పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించడానికి కృషి చేశాను.

తెరాస లోక్‌సభ పార్టీ ఉప నేతగా పార్లమెంట్‌లో ఎలాంటి పాత్ర పోషించారు?

రాష్ట్రానికి సంబంధించిన జాతీయ రహదారులు, రైల్వే, కాలుష్యం, హైకోర్టు, జాతీయ ట్రైబ్యునల్ వంటి అంశాల్లో కీలక పాత్ర పోషించాను. దాదాపు 80అంశాలపై ప్రశ్నలు సంధించాను. హైకోర్టు ఏర్పాటు, కృష్ణ, గోదావరి మిగులు జలాల కేటాయింపు కోసం రాజీలేని పోరాటం చేసి విజయం సాధించాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ, జల శాఖల నుంచి రావల్సిన అనుమతుల కోసం ప్రయత్నించాను.

నిర్భర్ భారత్ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదని సీఎం కేసీఆర్ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?

నిర్భర్ భారత్‌ను సీఎం కేసీఆర్ ఒక్కరే కాదు.. యావత్తు దేశం దీన్ని దుర్భర భారత్‌గా భావిస్తోంది. ఈ స్కీంపై భాజపా పాలిత రాష్ట్రాలు కూడా సంతృప్తిగా లేవు. ఈ పథకంలో ఒక్క అంశం కూడా ఏ రంగానికి పనికొచ్చేలా లేదు. ఈ పథకం పూర్తిగా విఫలం.

కరోనా వల్ల రాష్ట్ర అర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. ఈ స్థితిలో కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి ఎలా కృషి చేస్తారు?

వాస్తవంగా కేంద్రం అదనపు నిధులు ఇచ్చే పరిస్థితిలో లేదు. కేంద్రం ఇచ్చినా.. ఇవ్వకపోయినా రాష్ట్రాన్ని కాపాడుకునేలా ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించారు. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు డీలా పడ్డా.. కేసీఆర్ మాత్రం ధైర్యం కోల్పోవడం లేదు. కేసీఆర్ నాయకత్వంలో ఆర్థికంగా నిలదోక్కుకుంటామని ప్రజలు సైతం విశ్వాసంతో ఉన్నారు.

మీరు మొదటిసారి ఎంపీ అయినప్పుడు దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగే ప్రాంతం మీ నియోజకవర్గం పరిధిలో ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంతంలో నాలుగు ప్రాజెక్టులు వచ్చాయి. సస్యశ్యామలం కాబోతుంది. ఇందులో మీ పాత్ర ఎంత ఉంది?

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహించే ప్రాంతానికి ఎంపీగా ఉండటం, ఆయనతో కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నాలుగు ప్రాజెక్టులు రావడం సంతోషకరంగా ఉంది. నీళ్లు ప్రజలకు చేరడం అనేది గొప్ప విజయం. నిండు వేసవిలో చెరువులు మత్తడి దూకుతున్నాయి. ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, జల శాఖల నుంచి రావల్సిన అనుమతులు సాధించడంలో నావంతు పాత్ర పోషించాను. ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి హరీశ్‌ రావు నాయకత్వంలో రాష్ట్రానికి, నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కేంద్రంలో పోరాడుతా.

ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడ మీ నియోజకవర్గ పరిధిలో ఉంది. మీరు హామీ ఇచ్చినట్లుగా పూర్తిస్థాయిలో కాలుష్యం తగ్గినట్లు లేదు. పరిశ్రమల్లో ప్రమాదాలు సర్వసాధరణం అయ్యాయి. విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన నేపథ్యంలో మీరు ఎలా దృష్టి సారించారు?

మా ప్రాంతంలో పరిశ్రమలు, కాలుష్యం అత్యధికంగా ఉంటుందన్న ఉద్దేశంతో పార్లమెంట్ పర్యావరణ పరిరక్షణ, అటవీ కమిటీలో సభ్యునిగా చేరాను. ఒకప్పుడు బొంతపల్లి, ఖాజీపల్లి, బొల్లారం, పాసమైలారం ప్రాంతాల్లోని చెరువుల్లో రసాయన వ్యర్థ జలాలు ఉండేవి. చెరువుల్లోకి కాలుష్య జలాలు చేరకుండా నిరోధించాం. నక్కవాగు అంటే కాలుష్యకాసారంగా ఉండేది. ఇందులో గతంలో ఉన్న కాలుష్యంలో సగానికిపైగా తగ్గించాం. సాంకేతికతను ఉపయోగించి పరిశ్రమలు కాలుష్యాన్ని విడుదల చేయకుండా నియంత్రిస్తాం. వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. విశాఖ ఘటన జరిగిన మూడోరోజు అధికారులు, పారిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం. పరిశ్రమల పరిస్థితి, ప్రమాదాలపై సమీక్ష చేశాం. ప్రమాద రహితంగా పరిశ్రమలను ఉంచేలా అవగాహన కల్పించాం. ఈ ప్రాంతంలో కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించే వరకు కృషి చేస్తా.

గతంలో మెదక్‌ను టూరిజం సర్క్యూట్ చేస్తా అని హామీ ఇచ్చారు. ఇది పట్టాలు ఎక్కలేదు. ఈసారి దీన్ని సాధించే అవకాశం ఉందా?

టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు కేంద్రం వద్ద నిధులు లేకపోవడం వల్ల ప్రాజెక్టు రాలేదు. నర్సాపూర్, మెదక్, తూప్రాన్ అడవులు, ఏడు పాయల ఆలయం, మెదక్ చర్చ్, పోచారం చెరువులను కేంద్రంగా చేసుకోని టూరిజం సర్య్కూట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తా. సాధిస్తా.

రాబోవు నాలుగేళ్లలో మీ ప్రాథమ్యాలు ఏంటి?

నియోజకవర్గం పరిధిలో చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి సమస్యను ప్రాథమ్యంగా తీసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా.

ఇదీ చదవండి:'వానాకాలంలో పంట మార్పిడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'

ABOUT THE AUTHOR

...view details