తెలంగాణ

telangana

ETV Bharat / state

వనదుర్గమ్మ దర్శనానికి వెళ్తూ.. ప్రమాదంలో ఆరుగురు మృతి - సంగాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం

ఏడుపాయల వనదుర్గ ఆశీస్సుల కోసం వెళ్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు కబలించింది. వారు ప్రయాణిస్తున్న డీసీఎంను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 11 మంది గాయాలపాలయ్యారు. మృతులంతా బంధుమిత్రులే కావడం వల్ల ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. క్షతగాత్రులను కలెక్టర్ పరామర్శించారు. రవాణా మంత్రి అజయ్ కుమార్ బాధితులను ఆదుకుంటామన్నారు.

six women died and eleven members injured in road accident at sangaipeta
అమ్మవారి చెంతకు వెళ్తుండగా ప్రమాదం... ఆ కుటుంబలో విషాదం

By

Published : Mar 16, 2020, 8:50 PM IST

సంగారెడ్డి జిల్లా ఫసల్​వాడీకి చెందిన గొడుగు రాములు, లక్ష్మి దంపతులు ఏడుపాయల వనదుర్గమాతకు మొక్కు చెల్లించుకోవడానికి బంధుమిత్రులతో కలిసి డీసీఎంలో బయలుదేరారు. మెదక్​ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు, చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి.

మృతులంతా స్త్రీలే...

వాహనంలో పురుషులు ఒక వైపు, స్త్రీలు మరో వైపు కూర్చున్నారు. బస్సు స్త్రీలు కూర్చున్న వైపు ఢీ కొట్టింది. దీంతో మహిళలే మృత్యువాత పడ్డారు. పండగ చేస్తున్న రాములు అత్త మణెమ్మ, వదిన దుర్గమ్మ, మరదలు రజిత మరణించారు. రజిత మరణంతో ఆమె ముగ్గురు కూతుళ్లు అనాథలయ్యారు. మరో మృతురాలు మంజుల తన ఇద్దరు కూతుళ్లతో భర్తకు దూరంగా జీవిస్తోంది. దీంతో ఇద్దరు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. సత్యనారాయణ, మంజుల దంపతుల నాలుగేళ్ల కూతురు మధురిమ ప్రమాదంలో ప్రాణాలు విడిచింది.

ఆదుకుంటాం: మంత్రి

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను, క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. కలెక్టర్ ధర్మారెడ్డి ఆసుపత్రికి చేరుకొని మృతుల బంధువులను ఓదార్చారు. ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను, ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

అమ్మవారి చెంతకు వెళ్తుండగా ప్రమాదం... ఆ కుటుంబలో విషాదం

ఇదీ చూడండి:'అధికారం మీకే అప్పగిస్తాం... 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారా?'

ABOUT THE AUTHOR

...view details