'డబ్బులకు అమ్ముడుపోయి కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు' Revanth Reddy Speech at Narsapur Public Meeting : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న వేళ.. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పలు నియోజకవర్గాలు చుట్టేస్తూ.. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఓవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ మరోవైపు ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌రెడ్డి ఇవాళ నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చెప్పకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నర్సాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదేళ్లు అయ్యిందని.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Congress Narsapur Public Meeting :రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను కాంగ్రెస్ పంపిణీ చేసిందని ఆయన గుర్తుచేశారు. మహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న ఆయన.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హమీనిచ్చారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెలకు రూ.4 వేల పింఛను ఇస్తామని వెల్లడించారు. వివాహ సమయంలో మహిళకు తులం బంగారం ఇస్తామని రేవంత్‌రెడ్డి వివరించారు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే - ఆయన మనవడిని కూడా మంత్రిని చేస్తాడు : రేవంత్ రెడ్డి
Telangana Congress Election Campaign 2023 : పార్టీ ఫిరాయించిన ఒక నమ్మకద్రోహికి బీఆర్‌ఎస్ నర్సాపూర్‌లో టికెట్ ఇచ్చిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నర్సాపూర్‌ను చార్మినార్ జోన్‌లో కలిపే అంశాన్ని కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. నర్సాపూర్ లాంబాడీ సోదరుల అడ్డా అన్న రేవంత్.. లాంబాడీల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. అధికారంలోకి రాగానే నర్సాపుర్ పరిధిలోని లంబాడీ తండాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది అని హమీనిచ్చారు. బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ బొందలగడ్డగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy Comments on CM KCR : మాట్లాడితే కేసీఆర్ తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారని రేవంత్‌రెడ్డి మండిప్డడ్డారు. 'రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ 1.. నిరుద్యోగ సమస్యల్లో నెంబర్ వన్.. దేశంలోనే నెంబర్ 1 తాగుబోతుల అడ్డాగా తెలంగాణను మార్చారు' అని రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అమ్ముడుపోయి కేసీఆర్ పంచన చేరిన వారిని అసెంబ్లీ గేటు తాకనివ్వద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకల రాజ్యం అని కేసీఆర్ అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే లాంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చిన పార్టీ అని పేర్కొన్నారు.
'తిన్నింటి వాసాలు లెక్కబెట్టే కేసీఆర్‌ను ఓడించండి. తెలంగాణలో అరాచకం రాజ్యమేలుతోంది.. రాచరిక పాలన సాగుతోంది. ఇక కేసీఆర్ పాలనకు కాలం చెల్లింది. ఆయన్ను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చేసింది. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపించండి. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మాది.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Revanth Reddy Fires on CM KCR : తండాల్లో మారుమూల పల్లెల్లో పేదలకు నిలువ నీడనిచ్చి.. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని రేవంత్ చెప్పారు. 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పంచిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నారు. దళితులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసిందని తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన రాజ్యమని.. సాగునీటి ప్రాజెక్టులు కట్టి వ్యవసాయానికి సాగునీరు అందించిన రాజ్యమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యం లేకపోతే.. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం అడుక్కు తినేదని ఆరోపించారు. కేసీఆర్ సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్‌గా తనకు అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం.. కాంగ్రెస్ కాదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను నియమించిన సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకు అనే సంగతి మరిచిపోయావా? అని కేసీఆర్‌ని నిలదీశారు.
Revanth Reddy at Parakala Public Meeting : ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముక్కు నేలకురాసి క్షమాపణ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పరకాలలో జరిగిన విజయభేరి సభలో రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ మతి తప్పే.. ఇందిరమ్మ రాజ్యం గురించి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల దొరల భూములను సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు పంచింది ఇందిరమ్మ రాజ్యంలోనేనని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. దొరల రాజ్యం కావాలో ఇందిరమ్మ రాజ్యం కావాలో తేల్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీ మాటంటే శిలాశాసనమని.. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచినట్లే అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఉండదని కేసీఆర్ తప్పుడు మాటలు చెప్తున్నారు : రేవంత్ రెడ్డి
ఓటుకు 10 వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు : రేవంత్ రెడ్డి