ఏ కాలంలో అయినా ఒక్క రైతుకు మాత్రమే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎండకు, వానకు, చలికి తట్టుకుని పంటలు పండిస్తే చివరికి నడిరోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవాలంటే అష్ట కష్టాలు పడాల్సి వస్తోంది. ఒకవైపు కొనుగోళ్లు నిలిచిపోవడం.. మరోవైపు వరుణుడి దెబ్బతో అన్నదాత బతుకు కకావికలమవుతోంది. అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కురిసిన వర్షాలకు వరిధాన్యం(rains effect on paddy) మొలకలు వచ్చాయని రైతన్నలు వాపోతున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వాలు జాప్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షాల కారణంగా కొందరు రైతులు వరిని కోయక పోవడంతో పొలాల్లో పంట నేలకొరిగి పంట మొత్తం నేలమట్టం అయింది. పంట కోసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినా కనీసం 20 రోజులవుతున్నా తూకం వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కొనుగోలు కేంద్రాలతో పాటు రోడ్లపై ధాన్యం ఆరబెట్టడంతో వర్షం దెబ్బకు మొలకలు(rains effect on farmers) రావడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.