తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎట్లా పోవాలి.. శాశ్వత పరిష్కారానికి ఇంకెన్నేళ్లు..? - రామాయపల్లి తాజా వార్తలు

రామాయపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై నత్తనడకన ఫ్లైఓవర్‌ పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు వంతెన కిందకు నీరు చేరుతోంది. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కరానికి ఇంకెన్నేళ్లు వేచి చూడాలి అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

problems with Flyover works on National Highway 44 at Ramayapalli in Medak District
ఎట్లా పోవాలి.. శాశ్వత పరిష్కారానికి ఇంకెన్నేళ్లు..?

By

Published : Sep 29, 2020, 11:26 AM IST

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రామాయపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న రైల్వే వంతెనలోకి నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంటోంది. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా రెండేళ్ల క్రితం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రూ.100 కోట్లతో రైల్వే ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదటి దశలో మనోహరాబాద్‌- గజ్వేల్‌ మధ్య పనులు వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో జాతీయ రహదారిని ధ్వంసం చేసి ఇరువైపులా వంతెన నిర్మాణ పనులు చేపట్టారు.

ఆ మార్గంలో తిరిగే వాహనాలను సర్వీస్‌ రోడ్డుకు మళ్లించి రైల్వే అధికారులు పట్టాల ఏర్పాటును పూర్తి చేశారు. అంత వరకు బాగానే వంతెన కిందకు చేరిన వాననీరు పోయేందుకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో వాహనాలు వెళ్లేందుకు నిర్మించిన సర్వీస్‌ రోడ్డులో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి మనోహరాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని నీరంతా వచ్చి వంతెనలోకి చేరుతోంది.

ఫలితంగా ఇరువైపులా నిర్మించిన సర్వీస్‌ రోడ్డు వంతెనలో భారీగా నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రెండు రోజుల క్రితం ఇదే పరిస్థితి నెలకొంది. దేశంలోనే అత్యంత పొడవైన 44వ జాతీయ రహదారిపై నిత్యం 8 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అల్లాపూర్‌ టోల్‌గేట్‌ వద్ద నిత్యం రూ.12 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది.

పనులు వేగంగా సాగితేనే..

రామాయపల్లి వద్ద జాతీయ రహదారిపై మూడు మార్గాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సర్వీస్‌ రోడ్డుతో పాటు పట్టాల ఏర్పాటు పూర్తయింది. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు సాగించేందుకు భారీ ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నారు. ఈ పనులు వేగంగా పూర్తి అయితే మనోహరాబాద్‌- కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో వంతెనల నిర్మాణం కూడా కొలిక్కి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

నీరు నిల్వ ఉండకుండా చర్యలు

రామాయపల్లి వంతెనలో వర్షం నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం నీరు వెళ్లేందుకు చేసిన లైన్లను పెద్దవి చేస్తున్నాం. రాకపోకలకు అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే ఏడాది మార్చి లోపు 44వ జాతీయ రహదారిని సైతం పూర్తి చేసి వాహనదారులకు ఇబ్బందులు రాకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. -తరుణ్‌, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌

ఇవీ చూడండి:చుక్కల్లో కూరగాయల ధరలు.. బెంబేలెత్తుతున్న సామాన్యులు

ABOUT THE AUTHOR

...view details