తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ సాయం అందక పేదల ఇక్కట్లు - medak district latest news

దారిద్య్రరేఖకు దిగువన ఉండి రేషన్‌ కార్డులు లేని కుటుంబాలు, కార్డులో పేర్లు లేని వారు ప్రస్తుత లాక్‌డౌన్‌ వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్డులు లేకపోవడం వల్ల రేషన్‌ సరకులు, ప్రభుత్వం ఇచ్చే నగదు సాయం అందుకోలేకపోతున్నారు.

medak districts latest news
medak districts latest news

By

Published : May 5, 2020, 10:59 AM IST

ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించాక ఏప్రిల్‌ నెలనుంచి రేషన్​ కార్డున్న ప్రతి సభ్యుడికి 12 కిలోల ఉచిత బియ్యం, ప్రతి కార్డుకు రూ.1500 చొప్పున నగదు సాయం అందిస్తుంది. ఈ నెలలో ప్రతి కార్డుకు కిలో కందిపప్పు కూడా ఇస్తున్నారు. కొత్త ఆహార భద్రత కార్డుల మంజూరు ప్రక్రియ రెండేళ్లుగా నిలిచిపోయ్యాయి. ప్రస్తుత లాక్‌డౌన్‌ వేళ మెదక్​ జిల్లాలో కార్డులేని పేదలు చేసేందుకు పనులు లేక ఖర్చులకు చేతిలో నగదు లేక అవస్థలు పడుతున్నారు.

జిల్లాలోని 20 మండలాల్లో మొత్తం 2.13 లక్షల ఆహారభద్రత కార్డులకు ఏప్రిల్‌ నెలనుంచి ఉచిత బియ్యం, నగదు ఇస్తున్నారు. నూతనంగా ఆహార భద్రత కార్డుల్లో పేర్ల నమోదుకు జిల్లాలో అనేక దరఖాస్తులు వస్తున్నా అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇలా రెండేళ్లుగా వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా లబ్ధిదారులు తహసీల్దార్​ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం నూతన పేర్ల నమోదు, మార్పులు, చేర్పులకు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో పుట్టిన పిల్లలు, నూతనంగా వివాహాలు చేసుకున్న వారు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని మీసేవ నిర్వాహకులు సంబంధిత తహసీల్దార్​ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో పంపగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తహసీల్దార్‌ ఆమోదంతో డీఎస్‌ఓకు పంపాలి. డీఎస్‌ఓ ఆమోదం తెలిపితే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి మంజూరు లభిస్తే వారి పేర్లు ఆహార భద్రత కార్డుల్లో నమోదయి వారికి సంబంధించిన రేషన్‌ కోటా మంజూరవుతుంది.

నూతన కార్డుల మంజూరు, పేర్ల నమోదు ప్రక్రియ రెండేళ్లుగా నిలిచిపోవడం వల్ల ఆధార్‌ కార్డు ఉన్న చిన్నారులు, కొత్తగా పెళ్లయి కుటుంబంలోకి వచ్చిన వారికి రెండేళ్లుగా బియ్యం కోటా అందడం లేదు. క్షేత్ర స్థాయిలో విచారణ అనంతరం ఆన్‌లైన్‌లో మంజూరు అనుమతికి పంపిన దరఖాస్తులు డీసీఎస్‌ఓ కార్యాలయంలో పెండింగ్‌లో ఉండటం గమనార్హం. నిరుడు వరుస ఎన్నికలు, ఇతర కారణాలతో కొత్తకార్డులకు మోక్షం లభించలేదు. ప్రభుత్వం కార్డుదారులు, వలస కూలీలకు సైతం బియ్యం నగదు ఇస్తుండగా అర్హులైన దరఖాస్తుదారులపై కరుణ చూపడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రేషన్‌ కోటా, నగదు సాయం మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల లబ్ధిదారులు కోరుతున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం...

కొత్త కార్డులకు, పేర్ల నమోదుకు జిల్లాలో వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. మంజూరుకు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టాం. తాజాగా మొత్తం జాబితాను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వాదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.

- నగేష్‌, అదనపు పాలనాధికారి, మెదక్‌

ABOUT THE AUTHOR

...view details