మొగులు మబ్బుపట్టింది. సూర్యుడి జాడలేదు. కల్లాల నుంచి తెచ్చిన వడ్ల కుప్పలను చూస్తుంటే గుండె దడదడలాడుతోంది. ఒక వర్షం... ఆరు నెలల కష్టాన్ని నీటిపాలుచేస్తోంది. కొనుగోళ్లలో జాప్యం.... చెమటోడ్చి పండించిన పంటను(Paddy procurement issue) పనికిరాకుండా చేస్తోంది. నోటికాడికొచ్చిన ముద్ద ఎక్కడ చేజారుతుందోనని రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఓ వైపు వర్షాలు, మరో వైపు కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో ఐకేపీ కేంద్రాల వద్ద అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు.
రోజుల తరబడి
మెదక్ జిల్లాలో ఈ ఏడాది 375 కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. దీపావళి తర్వాత కొనుగోళ్లు(Paddy farmers problems) ప్రారంభమయ్యాయి. కానీ సాంకేతిక సమస్యలు, లారీల కొరత, ఖాళీ సంచులు లేకపోవడం... ఇలా ఎన్నో కారణాలతో ధాన్యం కొనుగోలులో తీవ్రజాప్యం జరుగుతోంది. దీంతో ధాన్యం అమ్ముకునేందుకు రోజుల తరబడిగా కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పులు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్రాల వద్ద ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడరాని కష్టాలు పడుతున్నారు. వరి కుప్పలపై టార్పాలిన్ కవర్లు కప్పుతూ.. కాపాడుకుంటున్నా.. ఇప్పటికే చాలాచోట్ల పంట వర్షార్పణమైంది. దీంతో ధాన్యం త్వరగా కొనాలంటూ అన్నదాతలు.... నిర్వాహకుల కాళ్లావేళ్లా పడుతున్నారు.
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు దాటింది. కాంటాలు వేసినా.. వీటిని మిల్లులకు తరలించేందుకు ఒక్క లారీ కూడా రావడం లేదు. లారీల కొరత, గన్నీ బ్యాగులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నాము. ఓ వైపు మబ్బు పట్టడంతో ఆరబోసిన ధాన్యం పచ్చిగా అయిపోతుంది. వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిపోతోంది. హమాలీల ఖర్చు, కిరాయిలు భరించలేకపోతున్నాం. ఆరుగాలం శ్రమించిన పంట నీటి పాలయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలి. -రైతుల గోడు