Judge visited old woman's home: పింఛను రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న బాధితురాలి గురించి తెలుసుకున్న న్యాయమూర్తి.. నేరుగా ఆమె ఇంటికి వెళ్లిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. శివంపేట మండలం శభాశ్‌పల్లికి చెందిన శివమ్మ అనే వృద్ధురాలికి రెండున్నరేళ్లుగా పింఛను రావడం లేదు. కొన్ని సాంకేతిక కారణాల కారణంగా శివమ్మ పింఛను నిలిచిపోయింది. దీంతో ఆమె ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా వయసుతో పాటు వచ్చే అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆమె సమస్య నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత దృష్టికి వెళ్లింది. వెంటనే బాధితురాలి ఇంటికి వెళ్లిన జడ్జి.. వివరాలు అడిగారు. ఆమె పండ్లు ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎప్పటి నుంచి పింఛను రావడం లేదో అడిగి తెలుసుకున్నారు.
స్యయంగా న్యాయమూర్తే తన సమస్య తెలుసుకుని ఇంటికి రావడం చూసిన వృద్ధురాలు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆమెతో తన గోడు వెళ్లబోసుకున్నారు. 'మీ కాళ్లు మొక్కుతా.. ఎలాగైనా పింఛను వచ్చేలా చూడండి.' అని వేడుకున్నారు. స్పందించిన జడ్జికి శివమ్మకు పింఛను వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు.