మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చెందిలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు హజరయ్యారు. సభ ప్రారంభంలోనే మాట్లాడిన తహసీల్దార్ భానుప్రకాశ్... పలువురు నాయకులు తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. భూమికంటే అధికంగా పట్టాలు ఇచ్చారని సీఎం కేసీఆర్ అన్నారని భానుప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తహసీల్దార్ వ్యాఖ్యలతో దుమారం... నాయకుల గరంగరం
ప్రభుత్వ పథానికి సంబంధించిన ఓ సమావేశంలో తహసీల్దార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ వైపు నాయకులు తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని... మరోవైపు అసెంబ్లీలో సీఎం తమదే తప్పన్నట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేయటం సమావేశంలో దుమారం రేపింది.
జిల్లాలో వారం రోజుల క్రితంవరకు పనిచేసిన జేసీ... పాంబండ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో మైనింగ్‌కోసం 2018లో జీవన్‌గౌడ్ దరఖాస్తు చేసుకున్నాడని తెలిపారు. తాను అనుమతులు ఇవ్వకపోగా... జేసీ పలుమార్లు ఫోన్‌చేసి ఒత్తిడి చేశారన్నారు. చేయమన్న పనులు చేయడంలేదని నాయకులు తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని తహసీల్దార్ ఆరోపించారు.
ఈ ఆరోపణలకు స్పందించిన మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మరికొంతమంది నాయకులు తహసీల్దారును అడ్డుకోగా... కొంత వాగ్వాదం జరిగింది. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో... సందర్భానుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కల్పించుకుని గొడవలు పడొద్దని.. నీతీనిజాయితీగా ఉండాలని సూచించారు. అధికారులను ఇబ్బందులకు గురిచేయవద్దని నాయకులకు సూచించారు.