ఉమ్మడి మెదక్ జిల్లాలోని పురపాలికలపై ఆర్థిక, పురపాలకశాఖ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సమీక్షించారు. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పట్ణణాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలన్న మంత్రి కేటీఆర్... రాష్ట్రంలో ఆదర్శ మున్సిపాలిటీ అయిన సిద్దిపేట నమూనా తీసుకుని ఇతర మున్సిపాలిటీల్లో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు.
విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే..
మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 42 అంశాల ప్రాతిపదికగా తీసుకొని... ఓ అభివృద్ధి నమూనా తయారు చేశామన్న మంత్రి... అన్ని మున్సిపాలిటీల్లో అవన్నీ ఉన్నాయో సరిచూకోవాలని సూచించారు. అన్ని పట్టణాల్లోనూ వనరులు, విద్యుత్, పారిశుద్ధ్య, నీటి ఆడిట్ చేపట్టాలన్న కేటీఆర్... ఆదాయవనరులు పెంచే విషయమై దృష్టి సారించి కొత్త మార్గాలను అన్వేషించాలని తెలిపారు. ప్రతి నెలా తప్పకుండా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. తడి, పొడి చెత్త సేకరణ, డంప్ యార్డుల నిర్మాణం, నిర్వహణపై దృష్టి సారించాలన్నారు.
ఉదయాన్నే ఫీల్డ్‌లో ఉండాల్సిందే..
పారిశుద్ధ్య కార్మికులకు రూ.12,000 జీతం నెల మొదటి వారంలోనే చెల్లించాలని... వారికి అవసరమైన దుస్తులు, బూట్లు, మాస్క్‌లు ప్రభుత్వం తరఫున అందించాలని సూచించారు. ఆగస్టు 15లోగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వెయ్యి మందికి మరుగుదొడ్డి ఉండే లక్ష్యంతో పని చేయాలని, అందులో 50 శాతం మహిళా శౌచాలయాలు ఉండాలన్నారు. 400 పాత బస్సులను తీసుకొని మహిళల కోసం పట్టణాల్లో మహిళల శౌచాలయాలు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్ ఉదయం ఐదున్నరకే ఫీల్డ్‌లో ఉండాలని కేటీఆర్ ఆదేశించారు. బయోలాజికల్, బయో మెడికల్, నిర్మాణ-శిథిలాల వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని సూచించారు.