మెదక్ కలెక్టరేట్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. ఏ లక్ష్యాల కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో... అవన్నీ నెరవేర్చుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలన్నీ పూర్తిగా తొలగించేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని తెలిపారు. పల్లె ప్రగతి, వైకుంఠదామాలు, హరితహారం వంటి ఎన్నో కార్యక్రమాలతో పల్లెలను అభివృద్ధివైపు తీసుకెళ్తున్నట్లు వివరించారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Formation Day: '70 ఏళ్లలో జరగని ప్రగతి... ఏడేళ్లలో చేసి చూపించారు'
70 ఏళ్లలో జరగని ప్రగతిని ఏడేళ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మెదక్ కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
భూముల సమస్యలు పరిష్కరించేందుకు ధరణి పోర్టల్ తీసుకొచ్చినట్లు తెలిపారు. గత ఏడేళ్లలో లక్షా 32 వేల 999 ఉద్యోగాలు భర్తీ చేశామని... త్వరలో మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో సమగ్ర ప్రగతి సాధించి దేశంలోనే మొదటి స్థానానికి తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. కొవిడ్ కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వివరించారు. అంతకుముందు చిన్న శంకరం పేటలో అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీశ్, ఎస్పీ చందన దీప్తి, అదనపు కలెక్టర్ రమేశ్ తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి:Harish rao: అమరవీరులకు మంత్రి హరీశ్ రావు నివాళులు