KTR Inaugurates Manoharabad ITC Factory: మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పరిశ్రమలో ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను చూశారు. రూ.450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన పరిశ్రమలో గోధుమ పిండి, చిప్స్, బిస్కెట్లు, నూడుల్స్ తయారు చేయనున్నారు. ఐజీబీసీ నుంచి ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ ధ్రువీకరణ పొందిన ఈ పరిశ్రమ సిబ్బందిలో 50 శాతం మహిళలు పని చేయనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో తెలంగాణలో హరిత, శ్వేత, నీలి, గులాబీ, పసుపు అనే ఐదు రకాల విప్లవాలు ఆవిష్కృతమయ్యాయని కేటీఆర్ తెలిపారు. దీంతో వచ్చిన పెట్టుబడి అవకాశాలను ఉపయోగించుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పరిశ్రమలు వచ్చినప్పుడు స్థానిక నేతలు సహకరించాలని కోరారు. అగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటు చేయాలని ఐటీసీ ప్రతినిధులను కోరారు. స్థానికంగా వైద్యారోగ్య రంగంలో ఐటీసీ సహకారం అందించాలని కోరారు. స్థానిక రైతుల నుంచి ముడి పదార్థాలు కొనాలని నాణ్యత విషయంలో అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
"పరిశ్రమలు వచ్చినప్పుడు స్థానిక నేతలు సహకరించాలి. పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టే పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఐటీసీ మరిన్ని పరిశ్రమలు పెట్టాలని ఆకాంక్షిస్తున్నాను. ఐటీసీ వంటి సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది." - కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి