మెదక్ పట్టణంలో ఆదివారం రాత్రి మూడేళ్ల చిన్నారిని చితకబాదిన తండ్రిపై చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మెదక్‌లో మూడేళ్ల చిన్నారిని ప్లాస్టిక్ తాడుతో తండ్రి చితకబాదిన వీడియోను హరీశ్‌రావుకు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ట్వీట్‌కు స్పందించిన హరీశ్‌రావు.. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
తినటానికి సతాయించినందుకు...
అన్నం తినేందుకు సతాయించిందని మూడేళ్ల చిన్నారిని కన్నతండ్రే కర్కషంగా కొట్టే వీడియో సోషల్ మీడియాలో సోమవారం వైరల్‌గా మారింది. ఈ ఘటన మొదక్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో జరిగింది. మెదక్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజుకు ఐదేళ్ల క్రితం మౌనికతో మొదటి వివాహం జరిగింది. వారికి శ్రీవల్లి, శ్రీవర్ధన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా... నాగరాజు మూడేళ్ల కిందట వెన్నెల అనే మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి గగనశ్రీ అనే మూడేళ్ల కుమార్తె ఉంది. కొంత కాలంగా నాగరాజు, వెన్నెలతో కలిసి వేరే ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి గగనశ్రీ... అన్నం తినేందుకు సతాయించింది. ఎంతలా చెప్పినా చిన్నారి మొండికేయడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు.. ప్లాస్టిక్ తాడుతో చిన్నారిని ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. కళ్ల ముందరే కూతురును కొడుతున్నా.. తల్లి వెన్నెల ఏమీ అనకపోవడం గమనార్హం.