తెలంగాణ

telangana

ETV Bharat / state

సిద్దిపేట అడవుల్లో పచ్చదనం పెంచేందుకు వినూత్న కార్యక్రమం - వనజీవి రామయ్య

ఉమ్మడి మెదక్ జిల్లాలో పచ్చదనాన్ని పెంచడానికి ఆర్థిక మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్లు లేని అటవీ భూముల్లో డ్రోన్ల ద్వారా విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య పాల్గోన్నారు. వనజీవిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.

minister harish rao started seed balls programme for increase forests in joint medak district
సిద్దిపేట అడవుల్లో పచ్చదనం పెంచేందుకు వినూత్న కార్యక్రమం

By

Published : Aug 2, 2020, 4:52 AM IST

సాధారణం కంటే తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న మెదక్ జిల్లాలో పచ్చదనాన్ని పెంచడానికి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛంద సంస్థల సహాయంతో విత్తన బంతులు తయారు చేయించి.. వాటిని అటవీ భూముల్లో చల్లే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సిద్దిపేట అర్బన్ పార్కులో మంత్రి హరీశ్ రావు, వనజీవి రామయ్య దంపతులు దీనిని ప్రారంభించారు. అటవీ భూముల్లో చెట్లు లేని ప్రాంతంలో గుట్టలపైన డ్రోన్ల ద్వారా విత్తన బంతులు విసురుతామని హరీశ్ రావు తెలిపారు. విత్తన బంతుల్లో కోతులకు ఆహారాన్ని ఇచ్చే చెట్లకు ప్రాధాన్యం ఇచ్చామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాలు అడవుల్లో చెట్లను నరికితే.. తెరాస ప్రభుత్వం అడవుల విస్తీర్ణం పెంపునకు కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

వనజీవిని స్ఫూర్తిగా తీసుకుందాం..

మనిషికి ప్రాణవాయువుని ఇచ్చే చెట్లను మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడని.. విచక్షణ రహితంగా చెట్లను నరికివేస్తున్నాం.. అని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దిల్లీ లాంటి ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని బయటికి రావాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం రామయ్య చేస్తున్న కృషిని హరీశ్ రావు కీర్తించారు. ఊహా తెలిసిన నాటి నుంచే మొక్కలు నాటడం ప్రారంభించిన వనజీవి.. ఇప్పటికి కోటికి పైగా మొక్కలు నాటారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీరు నాటిని మొక్కలు లక్షల సంఖ్యలో మహా వృక్షాలుగా ఎదిగాయని స్పష్టం చేశారు. వనజీవి రామయ్యను స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని మొక్కలు నాటుతామని ఆయన స్పష్టం చేశారు. రామయ్య దంపతులకు మంత్రి హరీశ్ రావు సన్మానం చేశారు.

విత్తన బంతులు మంచి ప్రయత్నం

బిడ్డకు తల్లికి మధ్య ఉన్న అనుబంధమే చెట్టుకు.. మనిషికి ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య పేర్కొన్నారు. అడవుల పునరుద్ధరణకు విత్తన బంతులు మంచి ప్రయత్నమని ఆయన స్పష్టం చేశారు. సహజంగా మొలకెత్తిన మొక్క బలంగా ఎదుగుతుందన్నారు. అటవీ ప్రాంతాల్లోని గుట్టల్లో ఆదాయం ఇచ్చే ఎర్రచందనం, టేకు వంటి విలువైన మొక్కలు, ఆహారాన్ని ఇచ్చే పండ్ల మొక్కలను పెంచాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తను 70ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఎర్రచందనం విత్తనాలు చల్లి పెంచుతున్నానని తెలిపారు. తాను సేకరించిన పలు రకాల విత్తనాలను మంత్రి హరీశ్ రావుకు రామయ్య దంపతులు అందించారు.

మహిళలకు కూడా ఆదాయం

భూమి పుత్ర, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తరుపున మొదటి విడతలో పది లక్షల విత్తన బంతుల తయారీని లక్ష్యంగా పెట్టుకున్నామని భూమి పుత్ర ఛారిటీ సంస్థ ఛైర్మన్ నేతి కైలాసం స్పష్టం చేశారు. మనుషులు వెళ్లి మొక్కలు నాటలేని ప్రాంతాల్లో సైతం పచ్చదనం పెంపు కోసం కృషి చేయాలన్న ఉద్దేశంతో డ్రోన్లు వినియోగిస్తున్నామని తెలిపారు. విత్తన బంతుల తయారీ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆదాయం కూడా సమకూర్చుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో విత్తన బంతులు చల్లేందుకు ఆసక్తి ఉన్న వాళ్లకు సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఫలవంతమైతే..

మొదటి విడత ప్రయత్నం ఫలవంతమైతే.. పెద్ద ఎత్తున విత్తన బంతులు చల్లి పచ్చదనం పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇవీ చూడండి: 'పెద్దలు మనపట్ల ఎంతో ప్రేమ చూపించారు.. ఇప్పడు అది మన బాధ్యత'

ABOUT THE AUTHOR

...view details