harish rao comments on modi warangal speech : కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాష్ట్రానికి వచ్చి కేసీఆర్‌ను విమర్శించిపోవడం తప్ప.. రాష్ట్రానికి ఏం చేయడం లేదని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణలో పనులు, అభివృద్ధి జరగకపోతే.. దిల్లీలో వివిధ శాఖలకు అవార్డులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. దిల్లీలో అవార్డులు ఇస్తూ.. గల్లీలో తిడుతున్నారని విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రధాని విమర్శలపై ఘాటుగా స్పందించారు.
Podu Pattas distribution in Telangana : తెలంగాణ పథకాలను మోదీ ప్రభుత్వం కాపీ కొట్టి.. పేరు మార్చి దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి.. బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతోందని విమర్శించారు. కేసీఆర్ గొప్పతనం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణకు వస్తున్న పరిశ్రమలను మోదీ గుజరాత్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి అదనపు నిధులు ఇచ్చామని ప్రధాని చెబుతున్నారన్న మంత్రి.. అదనపు నిధులు కాదు కదా.. హక్కుగా రావాల్సిన నిధులనూ ఆపేశారన్నారు. పార్లమెంట్ చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ రాకుండా కేంద్రం అడ్డుకుందన్న హరీశ్‌రావు.. కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించుకుపోయారని తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ద్వారా రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల నిధులు వచ్చేవని, వ్యాగన్ ఫ్యాక్టరీతో రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టారు.
''కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాష్ట్రానికి వచ్చి కేసీఆర్‌ను తిట్టిపోతున్నారు తప్ప.. రాష్ట్రానికి ఏం చేయడం లేదు. తెలంగాణలో పనులు, అభివృద్ధి జరగకపోతే మాకు దిల్లీలో వివిధ శాఖలకు అవార్డులు ఎందుకు ఇస్తున్నారు. తెలంగాణకు అదనపు నిధులు కాదు కదా.. హక్కుగా రావాల్సిన నిధులనూ ఆపేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. కోచ్ ఫ్యాక్టరీకి బదులు వ్యాగన్ ఫ్యాక్టరీని ఇచ్చింది మోదీ ప్రభుత్వం. కోచ్ ఫ్యాక్టరీ ద్వారా రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల నిధులు వచ్చేవి. వ్యాగన్ ఫ్యాక్టరీతో రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చారు.'' - మంత్రి హరీశ్‌రావు