గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద సీసీ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. మెదక్ కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో పాల్గొన్నారు.
వీటికి సంబంధించి పనులను మార్చి 31లోపు పూర్తి చేయాలని, లేకుంటే నిధులు వెనక్కి వెళతాయన్నారు. మెటీరియల్ కాంపొనెంట్ మొత్తం చెల్లింపుల్లో జాప్యంతో పనులు మందకొడిగా సాగుతున్నాయని, ఈ ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు రూ.61 కోట్లు విడుదల చేస్తామని అన్నారు.
కేంద్రం నుంచి ఉపాధి హామీ నిధులు వచ్చినా, రాకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ప్రస్తుతం పంచాయతీలకు ఇస్తున్న విధంగానే నెలనెలా మెటీరియల్ బిల్లులు చెల్లించేందుకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు. గ్రామాల్లో ఇళ్లపై వేలాడుతున్న విద్యుత్తు తీగలను తొలగించేందుకు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించనుందని, త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.
పల్లెప్రగతిలో చేపట్టిన పనులకు ప్రభుత్వం జిల్లాలకు ర్యాంకులు ఇస్తోందని, అందులో రాజన్న-సిరిసిల్ల జిల్లా ప్రథమస్థానంలో ఉందని, రెండో స్థానంలో సంగారెడ్డి జిల్లా ఉండగా 20వ స్థానంలో సిద్దిపేట జిల్లా, 22వ స్థానంలో మెదక్ ఉన్నాయన్నారు. ఇంకా ఏమైనా మిగిలిన పనులు వెంటనే పూర్తి చేసి జిల్లాను ముందు వరుసలో ఉంచాలని ఆదేశించారు.
గ్రామాల్లో సీసీ రహదారులకు రూ.500 కోట్లు: మంత్రి హరీశ్ ఇదీ చదవండి:'సీబీఎస్ఈ' చొరవ.. వికాస కేంద్రాలుగా విద్యాలయాలు