తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ యాసంగికి 350 కొనుగోలు కేంద్రాలు: హరీశ్​ రావు - paddy grain procurement in medak

యాసంగి ధాన్యం సేకరణపై మెదక్​ జిల్లా కలెక్టరేట్​లో మంత్రి హరీశ్​రావు సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్​లో సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల పంట చేతికొచ్చే అవకాశం ఉండటంతో... 350 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నిర్వహణపై ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు శిక్షణనివ్వాల్సిందిగా అధికారులకు సూచించారు.

harish rao, medak collectorate
మంత్రి హరీశ్​రావు, మెదక్​ కలెక్టరేట్​, ధాన్యం కొనుగోలు కేంద్రాలు

By

Published : Apr 8, 2021, 12:59 PM IST

గత రబీ కంటే ఈసారి మూడింతల ధాన్యం సేకరణ ఆశిస్తున్నామని.. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యాసంగి ధాన్యం సేకరణపై మెదక్​ జిల్లా కలెక్టరేట్​లో అధికారులతో మంత్రి హరీశ్​ రావు సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ముద్రించిన ధాన్యం మద్దతు ధర పోస్టర్​ను మంత్రి ఆవిష్కరించారు.

ధాన్యం మద్దతు ధర పోస్టర్​ను ఆవిష్కరిస్తున్న మంత్రి

కొత్త కొనుగోలు కేంద్రాలు..

గత రబీలో 78 వేల ఎకరాల్లో రైతులు పంట వేయగా ఈ యాసంగిలో 2 లక్షల 12 వేల ఎకరాల్లో వరి వేసినట్లు తెలిపారు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల మార్కెటింగ్​ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12న 350 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 55 వేల మెట్రిక్​ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు మాత్రమే ఉన్నాయని తెలిపిన మంత్రి... అక్కడ ఉన్న ధాన్యాన్ని తరలించాలని సూచించారు. రాష్ట్రంలోని మేడ్చల్​, హైదరాబాద్​, వికారాబాద్​ జిల్లాలకు తరలించాల్సిందిగా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్​ను ఫోన్​ ద్వారా కోరారు. కొత్త ధాన్యాన్ని ఖాళీ అయిన గోదాముల్లో భద్రపరచాలని చెప్పారు.

తాలు లేకుండా..

రైతులు 17 శాతం తేమ మించకుండా, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తేనే మద్దతు ధర లభిస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ విషయాన్ని రైతులకు తెలిసేలా ప్రతి కేంద్రం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నిర్వహణపై ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు శిక్షణ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఏ రోజు ధాన్యం ఆ రోజు మిల్లులకు తరలించేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ యరీష్​, అదనపు కలెక్టర్​ రమేష్​, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'సింగరేణి మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details