Harish rao at Edupayala: ఏడుపాయల వనదుర్గా మాత ఆలయాన్ని రూ.100 కోట్లతో అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీశ్ రావు అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సతీమణితో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రూ.100 కోట్లతో ఏడుపాయలను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏడుపాయలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి గర్భగుడి ముందు మంజీరా నదీ పాయ మధ్యలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగం వద్ద పూజలు చేశారు.
మహాశివరాత్రి పర్వదినం రోజున పవిత్ర మంజీరా నదీ పాయల మధ్య వనదుర్గామాత సన్నిధిలో జాతర వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారు జామున అమ్మవారికి అభిషేకం, అలంకరణచేసి, అర్చనలు నిర్వహించి జాతర వేడుకలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. ఓ వైపు శివనామస్మరణ, మరోవైపు దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయల ఆలయం మార్మోగింది.
ఏడుపాయలో ప్రతి ఏటా మాదిరే ఈసారి కూడా అద్భుతంగా వనదుర్గా భవాని అమ్మవారి జాతర నిర్వహించుకోవడం జరిగింది. దాదాపు వంద కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక్కడ చక్కని ఫౌంటేన్స్, కాటేజేస్ను అభివృద్ధి చేయనున్నాం.- హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి
శివుడి ఆశీస్సులతో కాళేశ్వరం పూర్తి
పరమ శివుడి ఆశీస్సులతో ముఖ్య మంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేశారని మంత్రి పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా సింగూర్ ప్రాజెక్ట్ నింపి అక్కడి నుంచి వన దుర్గా ప్రాజెక్ట్‌కు నీటిని తరలిస్తామన్నారు. కరువు వచ్చిన మంజీరా ఎండదు, ఏడుపాయలలో నీటి కొరత ఉండదని అన్నారు.
ఆలయాలకు అత్యంత ప్రాధాన్యం: తలసాని
ఏడుపాయల వద్ద మంత్రి తలసాని పూజలు ఏడుపాయల దుర్గామాత ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడుపాయలకు అనేక నిధులు కేటాయించారని తెలిపారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు సకల సదుపాయాలు ఉండాలన్నారు. ఏడుపాయల ఏటేటా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు.
ఆకట్టుకున్న అమ్మవారి రూపం
జాతర వేడుకల సందర్భంగా ఏడుపాయల వనదుర్గా భవాని మాత ప్రత్యేక అలంకరణతో ఆకట్టుకుంది. పూజారులు అమ్మవారిని పట్టుచీర, బంగారు కిరీటం, హారాలు, ముక్కుపుడకతో అలంకరించారు. గజమాలలు, గులాబీ పువ్వుల అలంకరణతో అమ్మవారి రూపం ఎంతో ఆకర్షణీయంగా భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ మండపాన్ని, ప్రాంగణాన్ని, ధ్వజస్తంభాన్ని రంగు రంగుల పువ్వులతో అలంకరించారు. రాజగోపురం నుంచి ఆలయానికి వెళ్లే దారిలో ఆకట్టుకునేలా కమాన్లు ఏర్పాటు చేశారు.
ఏడుపాయల క్షేత్రంలో వనదుర్గామాత సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులు
ఏడుపాయల్లో అంగరంగ వైభవంగా జరిగే జాతరను తిలకించేందుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. మంజీరా నదీ పాయల్లో పవిత్ర స్నానాలు చేసి వనదుర్గా భవాని మాతను దర్శించుకున్నారు. పలువురు బోనాలు తీసి, ఒడిబియ్యం పోసి, తోట్టెల్లు కట్టి, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి ఉపవాస దీక్షలు ఉన్న వారు సాయంత్రం ఏడుపాయలకు చేరుకుని దుర్గా మాతను దర్శించుకుని, స్థానిక శివాలయాల్లో పూజలు చేసి ఉపవాస దీక్షలు విరమించారు. పోతాంశెట్టిపల్లి వైపు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి భక్తులను జాతర ప్రాంగణానికి చేర్చేందుకు ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. జిల్లా కలెక్టర్ హరీశ్, అడిషనల్ కలెక్టర్ ప్రతీమా సింగ్ ఏడుపాయల జాతర ప్రాంగణంలో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
ఇదీ చూడండి: