రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, అతని అనుచరులు తమ అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నట్లు చాకలి లింగయ్య, మరికొంత మంది... ఏప్రిల్ 30న ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు... మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో విజిలెన్స్ విభాగం, అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేసి జమున హాచరీస్ భూకబ్జాకు పాల్పడినట్లు తేల్చారు. అందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
భూకబ్జా వివాదంపై ముగిసిన విచారణ... ప్రభుత్వానికి నివేదిక
మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జుమున హాచరీస్.. భూ ఆక్రమణలకు పాల్పడినట్లు విచారణాధికారులు తేల్చారు. 20 మంది రైతులకు చెందిన 66 ఎకరాలకుపైగా అసైన్డ్ భూమిని ఆక్రమించుకున్నట్లు వెల్లడించారు. ఎలాంటి అనుమతి లేకుండా చెట్లు నరికేశారని... అసైన్డ్ భూమి గుండా రహదారి వేసి అటవీ, వాల్టా చట్టాలను ఉల్లంఘించినట్లు జిల్లా అటవీ శాఖ అధికారి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ అందించారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో సర్వే నెంబర్లు 130/5, 130/9, 130/10, 64/6లోని అసైన్డ్ భూములను బలహీన వర్గాలకు ఒక్కొక్కరికి ఎకరా 20 గుంటలు లెక్కన 1994లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈటల రాజేందర్... అతని అనుచరులు తమ భూములను ఆక్రమించుకుని ఫౌల్ట్రీ షెడ్లు నిర్మించుకుని... తమను బెదిరిస్తున్నారని చాకలి లింగయ్య మరికొందరు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ నేతృత్వంలో విజిలెన్స్ అధికారులు రంగలోకి దిగి... విచారణ నిర్వహించారు. మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామ శివార్లలో ఉన్న 20 మందికి చెందిన 66 ఎకరాల ఒక గుంట అసైన్డ్ భూములను జమున హాచరీస్ యాజమాన్యం బలవంతంగా లాక్కున్నట్లు విచారణలో తేల్చారు.
అటవీ చట్టాల ఉల్లంఘన...
ఆక్రమించుకున్న సదరు భూమిలో జమున హ్యాచరీస్ లిమిటెడ్ కొన్ని షెడ్లు, భవనాలను నిర్మించినట్లు విచారణాధికారులు గుర్తించారు. అసైన్డ్ భూముల్లో కచ్చా రహదారి నిర్మించినట్లు మెదక్ జిల్లా అటవీ శాఖ అధికారి నివేదించారు. ఈ రహదారి నిర్మాణం సమయంలో ఏలాంటి అనుమతి లేకుండా చాలా చెట్లను నరికారని... ఇందుకు సంబంధించి అటవీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆందులో స్పష్టం చేశారు. వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్పు చేసుకోకుండానే పెద్ద ఎత్తున పౌల్ట్రీకి చెందిన అనేక నిర్మాణాలు చేశారని పేర్కొన్నారు. ఇందువల్ల కనవర్షన్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడిందని... అంచనా వేసి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వసూలు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి సమగ్ర విచారణ నివేదిక త్వరలోనే నివేదిస్తామని కలెక్టర్ ప్రభుత్వానికి తెలియజేశారు.