తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వస్థలాల బాటలో వలసజీవులు - వలస కార్మికులు

బతుకుదెరువు నిమిత్తం పొట్ట చేతపట్టుకొని వేలాది మంది వలస వచ్చారు. పరిశ్రమలు, ఇటుకబట్టీలు, భవన, ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణాల్లో పని చేసేందుకు పిల్లాపాపలతో సహా తరలివచ్చారు. రెక్కలు ముక్కలు చేసుకుని జీవనం సాగిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ వారి పాలిట శరాఘాతంలా మారింది.

medak district latest news
medak district latest news

By

Published : May 9, 2020, 3:12 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో వలస కార్మికులు తాత్కాలికంగా ఉపాధి కోల్పోవడం వల్ల పూట గడవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఈక్రమంలో దాతలు, ప్రభుత్వం ఇచ్చిన ఆసరాతో కొద్దిరోజులు గడిపారు. ఇప్పట్లో కరోనా వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టదని భావించి... సొంత ఊళ్లకు వెళ్లేందుకు వలస కూలీలు సిద్ధమవుతున్నారు.

మెదక్‌ జిల్లాలో మనోహరాబాద్‌, తూప్రాన్‌, చేగుంట, చిన్నశంకరంపేట, శివ్వంపేట మండలాల పరిధిలో సుమారు 300పైగా పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పని చేస్తున్నారు. చాలా మంది కుటుంబంతో సహా వచ్చి ఇక్కడే తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. మరికొందరు ఇటుక బట్టీలు, నిర్మాణ రంగాల్లో పని చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌తోపాటు, బిహార్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, పంజాబ్‌, ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, పశ్చిమబెంగాల్‌, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారు జిల్లాలో ఉన్నారు. వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో రూ.500 నగదుతోపాటు 12 కిలోల బియ్యం అందజేసింది. ఏప్రిల్‌ నెలలో ఇవ్వలేదు. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి దాతలు చేయూత అందించారు.

ప్రస్తుతం వారివద్ద చిల్లిగవ్వ లేకపోవడం... తినడానికి ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల తమ రాష్ట్రాలకు పయనమవుతున్నారు. కొందరు జాతీయ రహదారి మీదుగా కాలినడకన బయలుదేరారు. ఇటీవల కేంద్రం వారిని తరలించే విషయమై నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల వారీగా రైళ్లను ఏర్పాటు చేసి కార్మికులను తరలించాలని ఆదేశించింది.

ఇప్పటికి 1,387 మంది దరఖాస్తు...

రెవెన్యూ శాఖ నివేదిక ప్రకారం జిల్లా వ్యాప్తంగా 9,350 మంది వలస కార్మికులు ఉన్నారు. వారిలో ఇప్పటికే 200 మంది స్వగ్రామాలకు తరలివెళ్లారు. ఈక్రమంలో పలువురు ఆయా మండలాల్లోని పోలీస్‌స్టేషన్‌ లేదంటే తహసీల్దార్‌ కార్యాలయాల్లో పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఇలా నమోదు చేసుకున్న వివరాలను జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నారు. ఈమేరకు గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా 1,387 మంది కార్మికులు స్వస్థలాలకు వెళ్తామని దరఖాస్తు చేసుకున్నారు.

ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు నడపనున్న రైళ్ల ప్రకారం...వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రానికి రైలు వెళ్లనుందో సంక్షిప్త సందేశాన్ని కార్మికుల చరవాణి నంబర్లకు పంపుతారని కలెక్టరేట్‌, పోలీస్‌శాఖ వర్గాలు తెలిపాయి. మరికొందరు సొంతంగా వాహనాన్ని సమకూర్చుకొని వెళతామంటూ పాసుల కోసం స్థానిక పోలీస్‌స్టేషన్‌, జిల్లా పోలీస్‌ కార్యాలయానికి వెళ్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details