Telugu Students in Ukraine : సైరన్... బాంబుల మోతతో మా ప్రాంతం దద్దరిల్లుతోంది. ఎమర్జెన్సీ ప్రకటించగానే పదిహేను రోజులకు సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేశాం. అపార్ట్‌మెంట్‌లో కాలం వెళ్లదీస్తున్నాం.. అని రాగం మధుమిత్ర వాపోయారు. మెదక్ పట్టణంలోని జంబికుంటకు చెందిన రాగం శ్రీనివాస్, పద్మ దంపతుల రెండో కుమారుడు రాగం మధుమిత్ర బోగోమోలెట్స్ మెడికల్ యూనివర్సిటీలో చివరి సంవత్సరం చదువుతున్నారు. కరీంనగర్‌కు చెందిన నిఖిల్‌రెడ్డి, తమిళనాడుకు చెందిన రాజ్‌మోహన్‌తో కలిసి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. గతేడాది జూన్‌లో స్వదేశానికి వచ్చిన మధుమిత్ర సెప్టెంబరులో తిరిగి వెళ్లారు. రాకెట్లు మా ప్రాంతం నుంచి వెళ్తున్నాయని, బాంబుల మోత విన్పిస్తుందన్నారు. బంకర్‌లో తలదాచుకోవాలన్నా.. అవి చాలా దూరంలో ఉన్నాయని విద్యార్థి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ తరచూ కుమారుడితో ఫోన్‌లో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్ఢి.. విద్యార్థి తండ్రికి ధైర్యం చెప్పారు.
కంట్రోల్‌రూం ఏర్పాటు..
Medak Students in Ukraine :జిల్లాకు చెందిన వ్యక్తులు ఉక్రెయిన్‌లో ఉంటే.. సమాచారాన్ని స్థానిక పోలీసుస్టేషన్ లేదంటే జిల్లా పోలీస్ కార్యాలయ కంట్రోల్‌రూంకు అందించాలని ఇన్‌ఛార్జి ఎస్పీ రమణకుమార్ కోరారు. 08452-223533, 221667 లేదా వాట్సాప్ నంబరు 73306-71900కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఉక్రెయిన్‌లో విద్యార్థులు.. కుటుంబీకుల ఆందోళన
వికారాబాద్ :
Telangana Students in Ukraine :జిల్లా కేంద్రంలోని రామయ్యగూడకు చెందిన దినేష్ ఉక్రెయిన్‌లోని జాఫ్రోజియాలో వైద్య విద్య చివరి సంవత్సరం చదువుతున్నాడు. మే నెలలో తుది పరీక్షలు ఉండడంతో అక్కడే ఉండిపోయాడు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతుండటంతో రామయ్యగూడ ఎంఐజీలో ఉంటున్న తండ్రి రాంచంద్రయ్య, ఇతర కుటుంబ సభ్యులతో దినేష్ శుక్రవారం గంట గంటకూ వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాన్ని తెలుపుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భారత రాయబార కార్యాలయ అధికారుల సూచనల ప్రకారం ఇతర విద్యార్థులతో కలిసి ఇక్కడికి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
తాండూరు టౌన్ :
Russia Ukraine War :పట్టణానికి చెందిన నర్సింలు కుమారుడు సృజన్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదవడానికి ఆరు నెలల క్రితం వెళ్లాడు. అక్కడి చర్చిల్ విల్ సిటీలోని విల్‌మెన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. ఈ నెల 24న భారత్‌కు రావాల్సి ఉండగా యుద్ధం వల్ల అక్కడే చిక్కుకు పోయాడని వాపోయారు. అక్కడి విద్యార్థులను క్షేమంగా తీసుకు రావాలని, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాన మంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. చిన్న కొడుకు పృథ్వీరాజ్ జార్జియాలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరు కొడుకులు విదేశాల్లో ఉంటున్నారు.