Medak Mata Shishu Arogya Kendram Record : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల ప్రక్రియపై ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఆయా జిల్లాల ఉన్నతాధికారులు ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలు కొంత మేరకు ఫలిస్తున్నాయి. వైద్య సిబ్బంది నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్య కేంద్రాల్లో సదుపాయాల కల్పనకు తీసుకున్న చర్యలు ఇందుకు ఉపకరిస్తున్నాయి. దీంతో పీహెచ్‌సీల్లో ప్రసవాల నిర్వహణ పెరుగుతున్నట్లు అధికారిక లెక్కలు వివరిస్తున్నాయి. తాజాగా మెదక్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం సరికొత్త రికార్డు నమోదు చేసింది.
ఈ ఆసుపత్రిలో 24 గంటల్లో 25 ప్రసవాలు చేసి వైద్యులు రికార్డు సృష్టించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు ఒక్క రోజు వ్యవధిలోనే 25 ప్రసవాలు జరిగాయి. అందులో 12 సాధారణ ప్రసవాలు కాగా, 13 సిజేరియన్ చేశారు. ముఖ్యంగా ఆసుపత్రి విభాగ అధిపతి గైనకాలజిస్ట్ డాక్టర్ శివదయాల్ పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ వసుధ, అనస్థీషియా సాగరిక, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ రావు, స్టాఫ్ నర్సులు, నర్సులు, సపోర్టింగ్ స్టాఫ్, వైద్యసిబ్బంది 24 గంటలు శ్రమించి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రసవాలు చేశారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.