తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల పట్ల డీసీసీబీ అధికారుల తీరు అమానుషం: కిసాన్‌ కాంగ్రెస్ - కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేశ్‌ రెడ్డి

బ్యాంకులకు రుణాలు చెల్లించని రైతుల ఫోటోలు ప్రదర్శించడం చాలా దారుణమని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేశ్‌ రెడ్డి ఆరోపించారు. ఫ్లెక్సీలు వేసి రైతులను దొంగలుగా చిత్రీకరించడం అమానుషమన్నారు. బ్యాంకు అధికారుల తీరును నిరసిస్తూ మెదక్ జిల్లా పాపన్నపేట మండల కాంగ్రెస్‌ నాయకులు సమావేశం నిర్వహించారు.

medak kisan congress
కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేశ్‌ రెడ్డి

By

Published : Mar 25, 2021, 5:21 PM IST

రైతుల పట్ల డీసీసీబీ అధికారుల వ్యవహరించిన తీరు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు చూడలేదని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేశ్‌ రెడ్డి అన్నారు. రుణాలు చెల్లించని రైతుల పేర్లు ఫోటోలతో సహా ఫ్లెక్సీలు వేసి ప్రదర్శించడం అత్యంత దారుణమైన విషయమన్నారు. బ్యాంక్ అధికారుల తీరును నిరసిస్తూ మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలోని మంజీర గార్డెన్స్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రైతులకు సరైన దిగుబడులు రాక.. రుణాలు కట్టలేని పరిస్థితిల్లో ఉంటే సహకార సంఘాలు ఆదుకోవాల్సింది పోయి దొంగలుగా చిత్రీకరించడం అమానుషమన్నారు. ఇలాంటి చర్యలతో రైతులు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. రైతులు వ్యవసాయ అవసరాల కోసమే రుణాలు తీసుకున్నారే తప్ప.. విజయ్ మాల్యా, లలిత్ మోదీ లాంటి వాళ్లలాగా మోసాలు చేయలేదన్నారు.

ప్రభుత్వం రుణమాఫీ చేయాలి:

రుణ మాఫీ చేస్తామని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రెండేళ్లయినా హమీలు అమలు చేయకపోవటం వలన రైతులకు వడ్డీ భారం పెరిగిందని ఆరోపించారు. రైతులకు ఒకేసారి ప్రభుత్వం రుణ మాఫీ చేయాలని కోరారు. అలాగే రామాయంపేట మండలం కోనాపూర్ సొసైటీలో జరిగిన అవినీతిని.. నాబార్డు అధికారులతో విచారణ చేపట్టి డబ్బులను రికవరీ చేయాలని అన్వేశ్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంటరెడ్డి తిరుపతి రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఎల్లాపూర్ సర్పంచ్ ప్రభాకర్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:అప్పులకు బలైన రైతు కుటుంబం.. పరువు కోసం బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details