మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని.. ఈ విషయంలో ఆయా మండలాల ప్రత్యేకాధికారులు సమన్వయంతో పని చేయాలని మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులతో డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు, వైకుంఠధామాల నిర్మాణాలు, రైతుకల్లాల విషయాలపై కలెక్టర్ చర్చించారు. అభివృద్ధి పనుల విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా, త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వివరించారు.
'జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలి' - raithu vedhika
జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ వెంకట్రామి రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు శ్రద్ధ చూపాలని అన్నారు.
గ్రామాల్లో పల్లె ప్రకృతివనాల పనులు పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని.. ఈ విషయంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిందిగా డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌కు సూచించారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద పనులు చేసిన వారికి నిధులు విడుదల చేసి వారి ఖాతాల్లో డబ్బులు ఎప్పటికప్పుడు జమచేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, డీఏవో పరశురామ్ నాయక్, పంచాయతీ ఈఈ రామచంద్రారెడ్డి, డీపీవో హనోక్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పరిపాలనా సౌలభ్యమే లక్ష్యంగా సమీకృత కలెక్టరేట్‌లు