మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి మండలాల్లో నవంబర్ 3న ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన చర్యలపై కలెక్టర్ ఎం.హనుమంతరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. పోలింగ్ సమయంలో సిబ్బంది కొరత ఉండకుండా చూడాలని సంబంధిత నోడల్ అధికారికి తెలిపారు.
పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ నిర్వహిస్తామని.. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ను ప్రారంభిస్తామని కలెక్టర్ చెప్పారు. ఓటర్లు కరోనా నిబంధనలను పాటిస్తూనే పోలింగ్‌లో పాల్గొనాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్తు సరఫరా, సెంటర్ల ముందు టెంట్లు, తాగునీటి వసతితో పాటు వీల్ఛైర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని హనుమంతరావు వివరించారు.