తెలంగాణ

telangana

ETV Bharat / state

Medak collector Press meet: 'అసైన్డ్ భూములను ఈటల కుటుంబం కబ్జా చేసింది నిజమే' - మెదక్ కలెక్టర్ వార్తలు

Medak collector Harish latest Press meet : మాజీ మంత్రి, హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల పై సర్వే పూర్తైనట్లు మెదక్​ కలెక్టర్​ హరీశ్​ తెలిపారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా సర్వే చేశామని వెల్లడించారు. జమున హేచరీస్​ 70 ఎకరాల భూములను ఆక్రమించినట్లు స్పష్టం చేశారు.

Medak collector Pressmeet, Medak collector, Medak collector harish
ఈటల భూములపై మెదక్ కలెక్టర్ ప్రెస్​మీట్

By

Published : Dec 6, 2021, 1:02 PM IST

Updated : Dec 7, 2021, 7:16 AM IST

జమునా హేచరీస్ కబ్జాపై సర్వే

Medak collector Harish latest Press meet: మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కుటుంబీకులకు చెందిన జమునా హేచరీస్‌ ఆక్రమణలో 70.33 ఎకరాల ఎసైన్డు, సీలింగ్‌ భూములున్నట్లు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ వెల్లడించారు. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో పేదలకు కేటాయించిన ఈ భూములను కబ్జా చేశారని నిర్ధారించారు. దీంతో పాటు వివిధ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలిపారు. క్రిమినల్‌, సివిల్‌ చర్యలకు సిఫార్సు చేస్తూ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించారు. ఈటల తమ భూములను ఆక్రమించుకున్నారని 8 మంది రైతులు ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు మే 1న సర్వే నిర్వహించి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందించారు. నోటీసులు ఇవ్వకుండా సర్వే చేస్తున్నారని, ఇతర కారణాలతో జమునా హేచరీస్‌ ప్రతినిధులు హైకోర్టుకు వెళ్లగా.. అప్పట్లో పూర్తిస్థాయిలో సర్వే జరగలేదు. తాజాగా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నోటీసులు ఇచ్చి గత నెల 16న మళ్లీ సర్వే పనులు ప్రారంభించి వారంలో పూర్తి చేశారు. అనంతరం నివేదిక సిద్ధం చేశారు.

ఈటల భూములపై మెదక్ కలెక్టర్ ప్రెస్​మీట్

etela rajender land grabbing case : జమున హేచరీస్​లో 70.33 ఎకరాలు కబ్జా చేసినట్లు సర్వేలో తేలింది. 56 మంది అసైనీల భూములను కబ్జా చేశారు. అచ్చంపేట, హకీంపేట్‌ పరిధిలో అసైన్డ్ భూములు కబ్జాకు గురయ్యాయి. జమునా హేచరీస్ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసింది. అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారు. అనుమతులు లేకుండా పెద్ద పెద్ద షెడ్డులు నిర్మించారు. నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీప్రాంతంలో రోడ్లు వేశారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి చెట్లు నరికారు. పౌల్ట్రీ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్లు గుర్తించాం. అక్రమాలకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నా.. పెద్ద పెద్ద షెడ్​లు వేస్తున్నా.. అధికారులు చూస్తూ ఉండిపోయారు. పైగా నిషేధిత జాబితాలోని భూములకు రిజిస్ట్రేషన్ చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధిత అసైనీలకు న్యాయం చేసేలా కృషి చేస్తాం. ఈ నేపథ్యంలోనే అసైన్డ్ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక పంపాం.

-హరీశ్, మెదక్ కలెక్టర్

కలెక్టర్‌ తెలిపిన వివరాలివీ..

*హకీంపేటలో సర్వే సంఖ్య 97, అచ్చంపేటలో 77, 78, 79, 80, 81, 82, 130 సర్వే సంఖ్యల్లో కలిపి 70.33 ఎకరాలను దౌర్జన్యంగా ఆక్రమించారు. ఇందులో 61.13 ఎకరాలు ఎసైన్డ్‌ భూమి. 9.19 ఎకరాలు సీలింగ్‌ (ప్రభుత్వ) భూమి. 49 మంది బీసీలు, నలుగురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఒక ఓసీకి చెందిన భూములివి. వాటిని స్వాధీనం చేసుకుని లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. ఆక్రమించిన వారు ఎసైన్డు భూముల (బదిలీ నిషేధం) చట్టం ప్రకారం శిక్షార్హులు.

*సర్వే సంఖ్య 81లో అయిదెకరాలు, సర్వే సంఖ్య 130లో మూడెకరాలు జమునా హేచరీస్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. 2010 నుంచి నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములను రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదు. బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గమనించాం. చట్టం ప్రకారం సేల్‌డీడ్‌లను రద్దు చేయాలి. వ్యవసాయేతర అవసరాలకు వాడుకునేందుకు.. నమోదు చేసుకోకుండా భారీగా షెడ్ల నిర్మాణం చేపట్టారు. దీనికి సంబంధించి సబ్‌రిజిస్ట్రార్‌, తహసీల్దార్లపై విచారణ చేపట్టాలి.

*హేచరీస్‌ నుంచి వచ్చే వ్యర్థాలను సర్వే సంఖ్య 97లో పోస్తున్నట్లు తేలింది. దీంతో హల్దీవాగుకు అనుసంధానంగా ఉన్న ఎల్క చెరువు నీరు కలుషితమవుతోంది. భూగర్భజలాలతో పాటు వాయు కాలుష్యం నెలకొంటోంది. దీనిపై సమీప గ్రామాల ప్రజలు ఫిర్యాదులు చేశారు. పంచాయతీరాజ్‌, కాలుష్య నియంత్రణ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

*స్థానిక పంచాయతీల నుంచి అనుమతులు తీసుకోకుండానే హకీంపేట సర్వే సంఖ్య 111లో ఫౌల్ట్రీ ఫీడ్‌ నిల్వకు గాదెలు నిర్మించారు. అచ్చంపేట సర్వే సంఖ్య 130లో షెడ్లు ఏర్పాటు చేశారు. దీనిపై పంచాయతీ నుంచి తాఖీదులు జారీ అయ్యాయి. వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకోకుండానే నిర్మాణాలు చేపట్టడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది.

*సర్వే నం 130తో పాటు ఇతర సర్వే సంఖ్యల్లోని ఎసైన్డు భూములను జమునా హేచరీస్‌కు విక్రయానికి తెల్ల కాగితాలపై రాసుకున్న ఒప్పంద ప్రతులు లభ్యమయ్యాయి.

*ఈ రెండు గ్రామాల పరిధిలో మొత్తం 579 ఎకరాలు పేదలకు పంపిణీ చేశారు. ప్రస్తుతం సర్వే నిర్వహించిన భూముల్లో కాకుండా మరో 300 ఎకరాలకు సంబంధించి సర్వే చేయాలని దాదాపు 30 మంది వినతులు ఇచ్చారు. తమ భూముల్లోకి వెళ్లేందుకు అవకాశం లేకుండా ఆక్రమణలు జరిగాయని వారు చెబుతున్నారు. వాస్తవాలను గుర్తించేందుకు త్వరలో సర్వే చేపడతాం.

ఇవీ చూడండి:

Last Updated : Dec 7, 2021, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details