Medak Church is perfect for Christmas celebrations: మెదక్‌లోని పురాతన చర్చి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. గోతిక్ విధానంలో చేపట్టిన ఈ చర్చి నిర్మాణం 1914లో ప్రారంభమై 1924లో పూర్తయింది. లండన్‌కు చెందిన రెవరాండ్ చార్లెస్ వాకర్ ప్రాస్నేట్ అనే మతగురువు చర్చి నిర్మాణానికి పూనుకున్నాడు. పనికి ఆహారం విధానంలో ప్రాంరంభించి.. నిర్మాణంలో అందరూ పాలుపంచుకునేలా స్థానికులకు అవకాశం కల్పించారు. 12 వేల మంది కార్మికులు పదేళ్లు శ్రమించి అద్భుత కట్టడాన్ని సాకారం చేశారు. ఇందుకు కావలసిన నిధులను ప్రాస్నేట్.. ఇంగ్లండ్ నుంచి విరాళాలుగా సేకరించారు. అలా మహోన్నత ఉద్దేశంతో, శ్రమజీవుల చెమట నుంచి పుట్టిందే మెదక్ చర్చి.
ఇటలీ దేశస్తులతో పాటు భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు, కళాకారులు చర్చిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఈ చర్చిలో అతిపెద్దగా ఉండే కేథడ్రాల్‌లో 5వేల మంది ఒకేసారి ప్రార్ధన చేయవచ్చు. బ్రిటన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అద్దాలపై యేసు ప్రతిమ.. క్రీస్తు జీవితాన్ని అందంగా చిత్రీకరించారు. కుడి వైపు క్రీస్తు జననం.. ఎడమ వైపున శిలువ వేసిన దృశ్యం.. ఉట్టిపడేలా దర్శనమిస్తాయి. సూర్యకిరణాలు తాకగానే మరింత ప్రకాశవంతమవడం మరో ప్రత్యేకత.
"వంద ఏళ్లు కిందట ఈ చర్చి ప్రారంభించారు. మెదక్‌లో ఆసుపత్రులు, స్కూల్స్ కట్టడం కట్టారు. ఆ తరవాత ఈ చర్చిని కట్టాలని నిర్ణయించుకున్నారు. పనికి ఆహారపథకం కింద ఈ చర్చి నిర్మాణాన్ని సాగించారు. అందుకే ఈ ప్రాంతానికి మెదక్ అనే పేరు వచ్చింది. 174 అడుగుల ఎత్తుగల టవర్ ఉంది. దీని వెడల్పు 100 అడుగులు." - రోలండ్ పాల్, మెదక్ చర్చి కోశాధికారి
పూర్తిగా రాళ్లు, డంగు సున్నం ఉపయోగించి నిర్మించిన ఈ చర్చిలో ప్రతి అడుగు ఓ కళాఖండమే. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. 175 అడుగుల ఎత్తున్న శిఖరం.. నాటి కళావైభవానికి నిలువెత్తు నిదర్శనం. చారిత్రక కట్టడం గాను, ఆధ్యాత్మిక కేంద్రంగాను ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిని చూసేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. క్రిస్మస్ పర్వదినాల్లో తాకిడి ఎక్కువగా ఉంటుంది. క్రిస్మస్ వేళ ఉదయం నాలుగున్నర నుంచి రాత్రి పది గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్టించడంతో లాంఛనంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతాయి. భక్తుల సౌకర్యార్థం చర్చి నిర్వాహకులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ చర్చ్‌ని కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు వారు సందర్శిస్తుంటారు.
క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన మెదక్ చర్చి ఇవీ చదవండి: