తెరాస అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చూసి ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆదరించడం సంతోషంగా ఉందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు తెలిపారు. మంత్రి హరీశ్ రావు సమక్షంలో భాజపాకు చెందిన మెదక్ 22వ వార్డు కౌన్సిలర్ చందన సుమన్‌తో పాటు వంద మంది కార్యకర్తలు తెరాసలో చేరారు. మెదక్ పట్టణంలో మంచినీటి సమస్య పరిష్కారం అయిందని.. యావత్ తెలంగాణలో ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందిస్తామని హరీశ్ రావు తెలిపారు. ఇక తెలంగాణలో నీళ్ల సమస్య ఉండదన్నారు. హుజూర్ నగర్, నిజామాబాద్ ఎన్నికల ఫలితాలే దుబ్బాక ఉప ఎన్నికలో పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భాజపా 17 రాష్టాల్లో అధికారంలో ఉందని.. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఏ రాష్ట్రంలోనైనా అమలు చేస్తున్నాయా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల కోసం ఒక్క రూపాయి ఇవ్వకుండా అన్ని తామే ఇచ్చామని భాజపా నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చేసే తెలంగాణ ప్రభుత్వం మీద నిందలు వేస్తే సూర్యుడు మీద ఉమ్మేసినట్లు అని హరీశ్ రావు అభివర్ణించారు.