తెలంగాణ

telangana

medak student on Ukraine: మెదక్ విద్యార్థి అవస్థలు.. కిషన్‌ రెడ్డి, కేటీఆర్‌కు తల్లిదండ్రుల విజ్ఞప్తి

By

Published : Feb 25, 2022, 6:58 PM IST

medak student on Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో అక్కడున్న రాష్ట్రానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వైద్యవిద్య అభ్యసించేందుకు వెళ్లిన మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు అక్కడే ఉండిపోయాడు. తమ కొడుకును సురక్షితంగా ఇండియాకు రప్పించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

parents
మధుమిత్ర తల్లిదండ్రులు

medak student on Ukraine: ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆ దేశ రాజధాని కీవ్‌లో రష్యా బలగాలు మోహరించడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మెదక్ జిల్లాకేంద్రంలోని జంబికుంటకు చెందిన ఓ విద్యార్థి అక్కడే ఉండిపోయాడు. నిత్యావసరాలు దొరక్క ఇబ్బంది పడుతున్నట్లు అతని తల్లిదండ్రులు వాపోతున్నారు.

medak student on Ukraine

జిల్లాకేంద్రంలోని ఎస్వీ మెడికల్ షాప్ యజమాని రాగం శ్రీనివాస్​ కొడుకు రాగం మధు మిత్ర 2016 నుంచి ఉక్రెయిన్​ రాజధాని కీవ్‌లో ఉన్న బోగోమోలెట్స్​ నేషనల్​ మెడికల్​ యూనివర్సిటీలో ఎంబీబీఎస్​ చదువుతున్నాడు. ప్రస్తుతం అతను చివరి సంవత్సరంలో ఉండగా.. పరీక్షలు​ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్లాన్​ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలెట్టింది.

రెండు రోజులుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీపై రష్యా సైన్యం​​ బాంబుల వర్షం కురిపిస్తోంది. మా కొడుకు మధుమిత్ర ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్ల​గా దానిని మూసివేయడంతో తిరిగి రూంకు వెళ్లాడని అతని తండ్రి రాగం శ్రీనివాస్ తెలిపారు. నిత్యావసర సరుకులు దొరక్కపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాని వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెంటనే​ స్పందించి తమ కొడుకును సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

మా అబ్బాయి మధుమిత్ర ఎంబీబీఎస్ చివరి ఏడాది చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యాక రావాలనుకున్నాడు. ప్రస్తుతం కీవ్ సిటీలోనే ఉంటున్నాడు. యుద్ధం మొదలవగానే ఎయిర్‌పోర్ట్‌కి వచ్చి వెనక్కి వెళ్లిపోయాడు. మా అబ్బాయి అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అందువల్ల మా కొడుకును ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుతున్నా. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్‌ చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నా. - రాగం శ్రీనివాస్, విద్యార్థి తండ్రి

medak student on Ukraine

ABOUT THE AUTHOR

...view details