Lakshminagar Village: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది అది.. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో బీడు భూములు కొనుగోలు చేసి వ్యవసాయం ఆరంభించాయి. అక్కడే పూరిగుడిసెలు వేసుకొని లక్ష్మీనగర్ పేరుతో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. అలాంటి గ్రామం నేడు చక్కటి రహదారులు, వాటర్ ప్లాంట్, సీసీ కెమెరాలు, గ్రామం పేరుతో వెబ్‌సైట్, ఫంక్షన్ హాల్, సోలార్ వీధి దీపాలు.. ఇలా అన్ని హంగులూ సమకూర్చుకుని ఆదర్శ గ్రామంగా రూపుదాల్చింది.
ఐక్యంగా సాగడం, కమిటీలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పనులు నిర్వహించుకోవడం తమ విజయ రహస్యమని గ్రామస్థులు చెబుతున్నారు. ఏటా సంక్రాంతికి గ్రామ పుట్టిన రోజు జరుపుకోవడం వారికి ఆనవాయితీ. ఆ రోజు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద.. ఏడాదిలో మృతి చెందిన వారికి పేరు పేరునా నివాళులర్పించడం మరో విశేషం. ఈ సంక్రాంతికి లక్ష్మీనగర్ 75వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడానికి గ్రామస్థులంతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఐక్యతతో ‘క్రాంతి’ పథంలో అడుగులు వేస్తున్న లక్ష్మీనగర్ విశేషాలివి.
220 కుటుంబాలు.. 1200 జనాభా:అప్పట్లో కొత్తపల్లి పంచాయతీలో భాగంగా ఉన్న లక్ష్మీనగర్ 1995లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది. గ్రామస్థులు విరాళాలు సేకరించి పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నారు. గ్రామంలో 220 వరకు నివాసాలు.. 1,200 మంది జనాభా ఉన్నారు. వాటర్ ప్లాంట్ కమిటీ, హరితహారం కమిటీ, ఆలయ కమిటీ, సర్వే కమిటీ, ఆక్టివ్ వాలంటీర్ కమిటీలను ఏర్పాటు చేసుకుని ఆయా పనులను నిర్వహించుకుంటున్నారు.
ఈ గ్రామానికి చెందిన పెండ్యాల ప్రసాద్ (సాఫ్ట్‌వేర్ ఇంజినీరు) సంకల్పంతో 2014లో 11 మందితో సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. 2019లో గ్రామానికి చెందిన అనురాధ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ఉన్నవారికి కొత్తగా స్వయం ఉపాధి కల్పించే మార్గాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.