మెదక్ జిల్లాలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా సాయం కోసం వేలాది పేద కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఏడాదిగా దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాకపోవడం వల్ల లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. వివిధ దశల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండు పథకాలకు సంబంధించి గతేడాది, ఈ ఏడాది 3,535 దరఖాస్తులకు మోక్షం కలిగాల్సి ఉంది.
బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని పేదింటి ఆడపడచుల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తోంది. వివాహం అయిన వారు దరఖాస్తు చేశాక తహసీల్దారు పరిశీలించి ఎమ్మెల్యేలకు సిఫార్సు చేస్తారు. ఎమ్మెల్యేలు వాటికి ఆమోదముద్ర వేశాక అవి ఆర్డీవో కార్యాలయాలకు చేరతాయి. అక్కడ వాటికి ఆమోదముద్ర వేసి ఖజానా శాఖకు పంపాల్సి ఉంటుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే లబ్ధిదారులకు చెక్కులు అందుతాయి. ఈ ప్రక్రియ అంతా అంతర్జాలం ద్వారా చేపట్టాల్సి ఉంది.
రూ.17.12 కోట్లు అవసరం..
జిల్లాలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 1,711 మంది లబ్ధిదారులకు చెక్కులు అందాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాకు రూ.17.12 కోట్ల వరకు బడ్జెట్ అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 3,551 దరఖాస్తులు రాగా, అందులో మెదక్ డివిజన్‌లో 1,745, నర్సాపూర్ డివిజన్‌లో 911, తూప్రాన్ డివిజన్‌లో 895 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,029 దరఖాస్తులకు ఎమ్మెల్యేలు ఆమోదముద్ర వేయగా మంజూరు ప్రక్రియ వద్ద నిలిచిపోయాయి.